calender_icon.png 17 October, 2024 | 7:59 AM

ఏడుగురు జల సమాధి

17-10-2024 03:08:51 AM

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

  1. చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లిన కారు
  2. ఏడుగురు అక్కడికక్కడే మృతి.. డ్రైవర్‌కు గాయాలు
  3. మృతులు మూడు కుటుంబాలకు చెందిన వారు

వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.. చిన్నాపెద్దా అందరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ సంతోషంగా గడిపారు. మర్నాడు తిరిగి కారులో పిల్లాపాపలతో సరదాగా స్వగ్రామాలకు వస్తున్నారు. ఇంతలోనే విధికి కన్ను కుట్టిందో ఏమో మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. ఏడుగురిని జలసమాధి చేసింది. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

వేగంగా వెళ్తున్న కారు గుంతలోకి వెళ్లి అదుపు తప్పి అమాంతం గాల్లోకి లేచింది. తర్వాత చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. నీట మునిగి ఊపిరి ఆడక, గాయాలపాలై వారు మృత్యువాత పడ్డారు. డ్రైవర్ నామ్‌సింగ్ తీవ్ర గాయాల పాలయ్యాడు.  ఏడుగురి మృతితో తాళ్లపల్లి, భీమ్లా, జెగ్యా తండాల్లో విషాదం నెలకొంది. డ్రైవర్ అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

శివంపేట/వెల్దుర్తి, అక్టోబర్ 16: మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు వాగులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి, గాయాల పాలై ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన భార్యాభర్తలు శివరాం(56), దుర్గి (45), బీమ్లా తండాకు చెందిన తల్లి శాంతి (38), కుమార్తె అమ్ము (12), జెగ్యా తండాకు చెందిన తల్లి అనిత(35), కుమార్తెలు ఇందు (13), శ్రావణి (12)తో పాటు డ్రైవర్ నామ్‌సింగ్ మొత్తం ఎనిమిది మంది  కారులో మంగళవారం వర్గల్ మండలం సీతారాంపల్లి తండాలో బంధువుల ఇంటికి వెళ్లారు.

అక్కడ పిల్లాపాపల్తో హాయిగా గడిపి బుధవారం తిరిగి కారులో వస్తున్నారు. శివంపేట మండలం ఉసిరికపల్లి శివారుకు చేరుకోగానే కల్వర్టు వద్ద గుంటలో టైర్ పడి కారు అమాంతం గాల్లో లేచింది. తర్వాత కిందపడి చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రగాయాల పాలవడంతో పాటు నీట మునిగి శివరాం, దుర్గి, శాంతి, అమ్ము, అనిత, ఇందు, శ్రావణి అక్కడికక్కడే మృతిచెందారు.

డ్రైవర్ నామ్‌సింగ్‌కు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, శివంపేట, నర్సాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వాగు నుంచి కారును బయటకు తీయించారు. కొన్నిగంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.

గాయపడిన డ్రైవర్ నామ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నర్సాపూర్ సర్కార్ దవాఖానకు తరలించారు. ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏడుగురు మృతితో తాళ్లపల్లి, బీమ్లా, జెగ్యా తండాల్లో విషాదం నెలకొన్నది.

డ్రైవర్ అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.