- వారానికి 4 సర్వీసులను నడపనున్న ఎయిర్ ఏషియా
- అక్టోబర్ 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 29వరకు ఆఫర్
- సెప్టెంబర్ 22 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికే అవకాశం
- ప్రకటించిన థాయ్‌లాండ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియా
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): భారత్‌తో పాటు హైదరాబాద్‌లో తమ ఉనికిని విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా, పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియా ప్యాకేజీలను ప్రకటించింది. ఇందుకోసం కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‌ను పురస్కరించుకొని థాయ్‌లాండ్ చుట్టేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆల్ ఇన్ వన్ వే కింద కేవలం రూ.7,399తో వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా కమర్షియల్ హెడ్ తన్సితా, సీఈవో క్లోంగ్ చైయా వెల్లడించారు.
ఇందుకోసం హైదరాబాద్ నుంచి వారానికి 4 విమాన సర్వీసులను నడుపుతామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సమావేశానికి తెలంగాణ టూరిజం ఎండీ ప్రకాశ్ రెడ్డి, జీఎంఆర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన్సితా, క్లోంగ్‌చైయా మాట్లాడుతూ చెన్నై టు బ్యాంకాక్ మధ్య కూడా ఇదే తరహాలో తక్కువ ఛార్జీలతో సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. చైన్నై నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునే వారు రూ.6,990తో టికెట్ కొంటే సరిపోతుందని వెల్లడించారు.
చెన్నై మార్గంలో మూడు సర్వీసులను నడుపుతామని వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నాటికి తమ యాప్ ఎయిర్ ఏషియా మూవ్ యాప్, లేదా <http:// airasia.com/?> టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వారు చెప్పారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి 2025 మార్చి 29 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఇవీ షరతులు..
ఎఫ్‌డీ కోడ్ ఉన్న విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే థాయ్‌లాండ్‌లో పాఠశాలలకు సెలవులు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ ఆఫర్ వర్తించదని ఎయిర్‌ఏషియా ప్రతినిధులు చెప్పారు. ఇదివరకు దేశంలో 12 మార్గాల్లో తమ విమాన సర్వీసులను నడిపిస్తున్నట్లు తన్సితా, క్లోంగ్‌చై యా చెప్పారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో వ్యూహాత్మక నగరాలైన హైదరాబాద్, చైన్నై నుంచి తక్కువ ధరలో విమానాలను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
దీని ద్వారా భారత్ మార్కెట్‌లో తమ నిబద్ధత మరింత పెరుగుతుందన్నారు. థాయ్‌లాండ్ సందర్శించాలని చాలామంది భారతీయులు ఎదురుచూస్తున్నారని, వారికి ఈ ఆఫర్ చక్కటి అవకాశమన్నారు. ఈ విమాన సర్వీసులు భవిష్యత్‌లో మరిన్ని పెరుగుతాయని వివరించారు. ప్రయాణాలు పెరగడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌కు టూరిస్టులు పెరుగుతారు: టూరిజం ఎండీ
హైదరాబాద్ థాయ్‌లాండ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియా నడిపిస్తున్న విమాన సర్వీసుల వల్ల తెలంగాణకు కూడా పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ టూరిజం ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. థాయ్‌లాండ్‌లో బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారని, తెలంగాణలోని బౌద్ధరామాలు వారు సందర్శించడానికి చక్కటి ప్రదేశాలని చెప్పారు. ఈ విమాన సర్వీసులు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు.
రెండు దేశాలకు లబ్ధి: ఆశిష్ కుమార్
ఎయిర్ ఏషియా నడిపిస్తున్న విమాన సర్వీసులతో రెండు దేశాలకు లబ్ధి చేకూరుతుందని జీఎంఆర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని ఫ్లుట్లై అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దేశంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ నుంచి ఈ సర్వీసులను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.