calender_icon.png 24 October, 2024 | 1:59 AM

మోదీ క్యాబినెట్‌లో సెవెన్ సిస్టర్స్!

11-06-2024 12:00:00 AM

2024 పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ అందుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీతో పాటు మరో 71మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే మోదీ 3.0 మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. ఇది గతం కంటే చాలా తక్కువ. గత క్యాబినెట్‌లో మొత్తం 10మంది మహిళలు ఉన్నారు. కానీ ఈసారి కేవలం ఏడుగురికి మాత్రమే స్థానం లభించింది. మోదీ 3.0 కొలువుదీరిన ఏడుగురు మహిళల వివరాలేంటో తెలుసుకుందాం..

నిర్మలా సీతారామన్ (ఆర్థికమంత్రి)

తమిళనాడులోని మధురైలోని సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తండ్రి నారాయణన్ సీతారామన్ భారతీయ రైల్వే ఉద్యోగి. సీతారామన్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మద్రాసు, తిరుచిరాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. డిగ్రీలో అర్థశాస్త్రం.. జేఎన్‌యూలో ఎమ్‌ఏ, ఎకనామిక్స్ ఎంఫిల్ పూర్తి చేశారు. అవకాడో స్వీట్ చేయడం నుంచి ఆర్థిక మంత్రిగా ఎదిగిన నిర్మలా సీతారామన్‌కు అభిరుచులు.. చదవడం, రాయడం, శాస్త్రీయ సంగీతం వినడం, వంట చేయడం. ఇష్టమైన ఆహారం ఆలూ హల్వా. రాజ్యసభ ఎంపీగా.. ఆర్థిక, రక్షణశాఖ వంటి పెద్ద బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. క్యాబినెట్‌లో ఎక్కువ కాలం మహిళా ఆర్థిక మంత్రిగా కొనసాగిన మొదటి మహిళా నిర్మలాసీతామన్. 

అనుప్రియ సింగ్ పటేల్

అనుప్రియ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్) అధినేత్రి. ఆమె  మొద ట నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే మోదీ 2.0లో వాణిజ్యం, పరిశ్రమలకు సహాయ మంత్రిగా ఎంపికయ్యారు. అనుప్రియ  పార్టీ గత లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకోగా ఈసారి ఒకే స్థానాన్ని మాత్రమే పొందగలిగింది. 

అన్నపూర్ణదేవి

జార్ఖండ్‌లోని కోడెర్మా నుంచి వరుసగా రెండోసారి బీజేపీ ఎంపీగా ఎన్నికైన అన్నపూర్ణదేవికి క్యాబినెట్‌లో కేంద్రమంత్రి పదవి దక్కింది. అన్నపూర్ణదేవి 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల్లో ఆమె ఒకరు. భర్త మరణం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆమె గతంలో రాష్ట్రీయ జనతాదళ్‌లో పని చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీలో చేరారు. 

రక్షా ఖలడ్సే

37 ఏళ్ల రక్షా ఖలడ్సే క్యాబినెట్‌లో అతి పిన్నవయస్కురా లైన మహిళా మంత్రి. ఆమె కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ చదివారు. రక్షా మహారాష్ట్రలోని సీనియర్ బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖలడ్సే కోడలు. 26 ఏళ్ల వయసులో తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టింది. రేవర్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రక్షా గతంలో సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ సభ్యులుగా పని చేసిన అనుభవం ఉంది. 

 శోభా కరంద్లాజే

శోభా కరంద్లాజే కర్నాటక నుంచి మూడోసారి ఎంపీ అయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఆమెకు మళ్లీ రాష్ట్ర మంత్రిగా స్థానం లభించింది. శోభా గత ప్రభుత్వంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 57 ఏళ్ల శోభ సోషియాలజీలో ఎంఏ చదివారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితులైన వారిలో ఈమె ఒకరిగా చెప్పుకుంటారు. శోభా 25 ఏళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు. 

సావిత్రి ఠాకూర్

మోదీ 3.0లో చేరిన మరో మంత్రి సావిత్రి ఠాకూర్. మధ్యప్రదేశ్‌లోని ధార్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొం దిన గిరిజన నాయకురాలు. 46 ఏళ్ల సావిత్రి పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 2014లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 

నిముబెన్ జయంతీభాయ్ 

నిముబెన్ జయంతీభాయ్ బంభానియా గుజరాత్‌లోని భావ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 57 ఏడేళ్ల జయంతిభాయ్ బంభానియా సామాజిక కార్యకర్తగా, ఉపాధ్యాయురాలిగా పని చేసిన అనుభవం ఉంది. గతంలో ఆమె మేయర్‌గా కూడా పని చేశారు. ఈసారి ఎన్నికల్లో బంభానియా అత్యంత మెజారిటీతో 4.50 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించింది.