న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రైమరీ మార్కెట్ జోరు ఈ వారం సైతం కొనసాగనుంది. రెండు మెయిన్‌బోర్డ్ ఐపీవోలతో సహా మొత్తం ఏడు పబ్లిక్ ఆఫర్లు జారీకానున్నాయి. మరోవైపు గతవారం ఐపీవోలకు వచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు 13 కంపెనీలు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ వారం మెయిన్‌బోర్డులో ఆర్కడే డెవలపర్స్ ఐపీవో సెప్టెంబర్ 16న ప్రారంభమై 19న ముగుస్తుంది. రూ.121 128 ప్రైస్‌బ్యాండ్‌తో తీసుకొస్తున్న ఈ ఆఫర్ ద్వారా రూ.410 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. మరో కంపెనీ నార్తరన్ ఆర్క్ క్యాపిటల్ రూ.777 కోట్ల సమీకరణకు జారీచేస్తున్న ఐపీవో కూడా సెప్టెంబర్ 16న మొదలై 19న ముగుస్తుంది. షేరుకు రూ.249 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది.
నేడు బజాజ్ ఫైనాన్స్ లిస్టింగ్
గతవారం జారీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించిన దృష్ట్యా మార్కెట్ వర్గాలు ఈ కంపెనీ లిస్టింగ్ పట్ల ఆసక్తితో వేచిచూస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో సెప్టెంబర్ 16 సోమవారం లిస్టవుతాయి. రూ.6,500 కోట్ల సమీకరణకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో 63.60 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ధరను రూ.70గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ద్వారా రూ.3,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయగా, రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో మాతృసంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయించింది. గతవారం వచ్చిన టొలిన్ టైర్స్ ఐపీవో, క్రాస్ కంపెనీ ఐపీవీలు కూడా కూడా 16నే లిస్టవుతాయి. పీఎన్‌జీ జ్యువెలర్స్ సెప్టెంబర్ 17న లిస్టవుతుంది.