యూపీ: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. బస్సు రాయబరెల్లి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 25 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం గురించి ఎస్‌ఎస్‌పి ఇటావా సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ, “రాయ్‌బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు అర్ధరాత్రి కారును ఢీకొట్టింది. బస్సులో నలుగురు, కారులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కారు ఆగ్రా నుంచి లక్నోకు వెళ్తోందని, డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉండడంతో లేన్‌ను దాటుకుని వచ్చి బస్సును ఢీకొట్టిందని చెప్పారు. ఢీకొన్న తర్వాత, బస్సు డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోవడంతో, బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై నుండి అదుపుతప్పి లోయలో పడిపోయింది. సీఓలు, ఎస్‌డీఎంలు, ఇతర అధికారులందరూ సైట్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.
ఎస్‌ఎస్పీ వర్మ మాట్లాడుతూ.. బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే వారి కోసం, ఆగ్రా లేదా లక్నోకు తిరిగి వెళ్లాలనుకునే వారిని వెనక్కి పంపగా, ప్రయాణిస్తున్న బస్సులలో వారికి సౌకర్యం కల్పించడం ద్వారా వారి తదుపరి ప్రయాణాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.