calender_icon.png 7 January, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7 అంతస్తులు నేలమట్టం

06-01-2025 01:08:43 AM

  1. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేసిన హైడ్రా 
  2. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చివేత
  3. అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. మరోసారి విజృంభించింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కదంతొక్కింది. సర్వే నంబరు 11/5లో ప్లాట్ నంబరు 5/13 పేరిట 684 గజాలలో అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనాన్ని హైడ్రా ఆదివారం నేల మట్టం చేసింది.

స్థానిక పోలీసులతోపాటు హైడ్రాకు చెందిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించగా, కూల్చివేతల సమయం లో ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు 7 అంతస్తుల భవనం 100 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రహదారికి ఆనుకుని ఉండగా, ఎలాంటి సెట్‌బ్యాక్ వదలకుండా నిర్మాణం చేశారు.

ఈ భవనానికి తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించక పోవడం, సెల్లార్‌లోనే కిచెన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి శనివారం దీనిని పరిశీలించారు. ఎలాంటి సెట్ బ్యాక్ వదలకపోవ డంతోపాటు తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం, సెల్లార్‌లోనే కిచెన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనించారు.

ఈ భవనాన్ని కూల్చివేస్తున్నట్టు 2024 ఫిబ్రవరి 14న జీహెచ్‌ఎంసీ నోటీసు లు జారీచేసింది. అదే నెల 26న స్పీకింగ్ ఆర్డ ర్ ఇచ్చింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ (రిట్ పిటీషన్- 10030/2024) 2024 ఏప్రిల్ 19న హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. ఈ సమయంలో 2024 జూన్ 13న జీహెచ్‌ఎంసీ నామమాత్రంగానే కూల్చివేయడంతో సదరు యాజమాని భవన నిర్మాణాన్ని కొనసాగించాడు.

దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి హైకోర్టు ఆదేశాలను పరిశీలించిన వెంటనే కూల్చివేతలకు ఆదేశించింది. దీంతో 7 అంతస్తుల ఈ భవనాన్ని హైడ్రా ఆదివారం నేలమట్టం చేసింది. ఈ భవన నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైడ్రా ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను పంపనుంది. 

అయ్యప్ప సొసైటీ అక్రమాలను సమీక్షిస్తాం

అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సమీక్ష నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆదివారం కూల్చేసిన భవనానికి నిర్మాణ అను మతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందజే స్తుందని చెప్పారు.

అయ్యప్ప సొసైటీలో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు పలు అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఆయా భవనాలకు ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేవన్నారు. అక్రమ నిర్మాణాల కార ణంగా మురుగు నీటి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. మల మూత్రాలు రోడ్డుపైకి వస్తున్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. మౌలిక సదుపాయాలపై (డ్రెయినేజ్ పైపులపై) అధిక భారం పడుతుందన్నారు.