26-02-2025 01:01:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): గడిచిన 48 గంటల్లో తెలంగాణలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటి వరకు 450 మంది రైతులు ప్రాణాలు వదిలినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డిలో కనీసం చలనం లేదని విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుని 8 మంది కార్మికులు ప్రాణాపాయంలో ఉన్నా, రేవంత్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియో జకవర్గానికి చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమక్షం లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ గాలి వీస్తోందని పేర్కొన్నారు.
బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు...
రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ పగిలితే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారని విమర్శించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జ్ కొట్టుపోయిన ఘటనలపై బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ను ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే రాజీనామా చేయ్...
కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, అక్కడ బీఆర్‌ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ అర్థమవుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుం డా కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్య మేనని స్పష్టం చేశారు. పార్టీ రజతోత్సవాలను ఘనం గా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.