calender_icon.png 24 October, 2024 | 9:51 AM

సిమ్ మార్పిడి తర్వాత పోర్టబిలిటీకి 7 రోజుల సమయం

14-07-2024 12:08:29 AM

ఆ లోపు యూపీసీ తిరస్కరణ

ప్రస్తుత చందాదారు పోగొట్టుకున్న లేదా పనిచేయని సిమ్‌ను కొత్త సిమ్‌తో మార్చుకున్న తర్వాత ఏడు రోజుల వరకూ ఆ నంబరును వేరే టెలికాం నెట్‌వర్క్‌కు బదిలీ చేసుకునే వీలులేదు. ఇప్పటివరకూ ఈ గడువు సమయం 10 రోజులు ఉండగా, జూలై 1 నుంచి 7 రోజులకు తగ్గనుంది. సిమ్ స్వాప్, రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) నిబంధనలను 2024 మార్చి 14న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

చందాదారు తన టెలికాం సర్వీసుల కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పటికీ, మొబైల్ నంబరును యథాతథంగా అట్టిపెట్టుకునే సదుపాయమే ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ. నంబర్ పోర్టబిలిటీని కోరుకునే చందాదారుకు యూనిక్ పోర్టింగ్ కోడ్‌ను (యూపీసీ) కేటాయిస్తారు. ఆ కోడ్‌ను నిర్ణీత ఫారంలో ఎంటర్‌చేసిన తర్వాతే నంబర్‌పోర్టబిలిటీ జరుగుతుంది. మీరు మారే కంపెనీ కొత్త సిమ్ అందచేస్తుంది.  తాజా నిబంధనల ప్రకారం  సిమ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఏడు రోజుల్లోపు పోర్టబిలిటీకి అవసరమైన యూపీసీ కేటాయించరాదని ట్రాయ్ తాజా నిబంధనల్లో పేర్కొంది. అసాంఘిక శక్తులు మోసపూరిత స్విమ్‌స్వాప్/రీప్లేస్‌మెంట్ మార్గాల ద్వారా మొబైల్ నంబర్ల పోర్టింగ్‌ను నిరోధించే లక్ష్యంతో ట్రాయ్ తాజా సవరణలు తీసుకువచ్చింది. 

సిమ్ స్వాప్ మోసాలు

ఇటీవలికాలంలో సిమ్ స్వాప్ మోసాలు పెరుగుతున్నాయి. సిమ్ స్వాపింగ్ ద్వారా మోసగాళ్లు బాధితుడి ఫోన్ నంబరుపై కొత్త సిమ్‌కార్డును పొంది వారి కాల్స్‌ను, మెసేజ్‌లను ఫాలోకావడం ద్వారా కీలకమైన ఫైనాన్షి యల్, వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు. దీంతో స్విమ్‌స్వాప్ తర్వాత నంబర్ పోర్టబిలిటీకి తప్పనిసరిగా వేచిచూడాల్సిన సమయాన్ని ట్రాయ్ నిర్దేశించింది. దీంతో పాటు అదనపు భద్రతగా 7 రోజుల్లోగా యూపీసీ కేటాయింపును సైతం నిరోధించింది.