calender_icon.png 21 January, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సప్త వర్ణాలు

24-07-2024 02:13:38 AM

ఏడు బడ్జెట్ ప్రసంగాల్లో ఏడు వేర్వేరు రంగు చీరలు

న్యూఢిల్లీ, జూలై 23: లోక్‌సభలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్.. తన ఆహార్యంతోనూ ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. ఏడు వేర్వేరు వర్ణాల చీరల్లో దర్శనమిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన మన దేశంలో.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలను ప్రస్ఫుటించే వస్త్రాధరణతో ఆకట్టుకున్నారు. మంగళవారం 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలుపు రంగు చీరతో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి చేనేత కార్మికులు రూపొందించిన చీరను నిర్మలా సీతారమన్ ధరించారు.

ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ నీలి రంగు చీర ధరించారు. బెంగాల్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంథా శైలి చీరపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం కాంథా శైలి చీరలకు గిరాకీ కూడా పెరిగింది. ఇక అంతకుముందు 2023 బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు కర్ణాటక చేనేత చీర ధరించారు. 2022లో ఒడిశా గంజాం జిల్లాకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన ముదురు గోధుమ రంగు చీర ధరించగా.. 2021లో పోచంపల్లి చీరలో దర్శనమిచ్చారు.

2020లో పసుపు రంగు చీరలో బడ్జెట్ ప్రసంగం వినిపించిన నిర్మలా సీతారామన్.. ఈ ఏడుసార్లు ఎరుపు రంగు దస్త్రంలో బడ్జెట్ ప్రతులతో దర్శనమిచ్చారు. ఇలా దేశ నలుమూలల్లోని ప్రఖ్యాత చేనేత వస్త్రాధరణతో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. తాను ధరించిన చీర రూపొందించిన ప్రాంతానికి పద్దులో అత్యధిక కేటాయింపులు చేయడం గమనార్హం. ఈ ఏడాది బడ్జెట్‌నే తీసుకుంటే.. మంగళగిరి చీరతో ధరించిన నిర్మలా సీతారామన్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇతోధిక సాయం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రకటించడంతో పాటు.. అవసరమైతే మరింత సాయం చేస్తామని మాటిచ్చారు.