- ప్రధాని పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యక్రమాలు
- గాంధీ జయంతి వరకు.. స్వచ్ఛంద సేవ, పార్టీ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణలో వివిధ కార్యక్రమాల ద్వారా బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సేవాపక్షం పేరిట ప్రధాని మోదీ పుట్టినరోజు నుంచి మొదలుకొని గాంధీ జయంతి వరకు వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియతో ప్రజల్లో విస్తృతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. మంగళ వారం ప్రధాని మోదీ పుట్టినరోజు కాగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు అనేక కార్యక్ర మాల ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నేతలు, కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం.
ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో సేవాపక్షంను విజయవంతం చేయడంపై విస్తృతంగా చర్చ జరిగింది. మంగళవారం నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టే రోజువారీ సేవా కార్యక్రమాలపై పార్టీ నేతలకు లక్ష్మణ్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో పక్షం రోజులపాటు సాగే సేవా కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు.
సెప్టెంబర్ 17, 18, 19 తేదీల్లో మోదీ జన్మదినం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి జిల్లా ల్లో ఫొటో ఎగ్జిబిషన్, 25న పార్టీ సభ్యత్వ నమోదు, 18 25 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, పోటీ చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలో కేంద్రాల్లో మెగా హెల్త్ క్యాంపులు, సెప్టెంబర్ 1౭ నుంచి అక్టోబర్ 2 కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్ల్లాలో మోదీ సేవాభావంపై మేధావుల సదస్సులు, అక్టోబర్ 2 అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహాలను శుభ్రపర్చి అలంకరించడం, హైదరాబాద్‌లోపారా ఒలంపిక్స్‌లో తెలంగాణ నుంచి విజయం సాధించిన వారికి సన్మానం, సెప్టెంబర్ 18 అక్టోబర్ 2న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించనున్నారు.
సేవాపక్షం గొప్ప కార్యక్రమం
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాష్ట్రంలో సేవాపక్షం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ జయంతి వరకు కొనసాగిస్తాం. సేవా పరమో ధర్మం సూత్రానుసారం సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ ఈ పక్షం రోజులు అనేక కార్యక్రమాలను చేపడుతుంది.
డాక్టర్ కే లక్ష్మణ్, ఎంపీ,
బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు