18-02-2025 12:00:00 AM
వికారాబాద్, ఫిబ్రవరి 17: సంత్ సేవాలాల్ మహారాజ్ ఇచ్చిన బోధనలు, ఆచరణలను పాటిస్తూ సమాజ సేవకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ... సమాజంలో సంచార జాతులుగా ఉండే బంజారాలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారన్నారు. సంత్ సేవాలాల్ జంతు బలి నిషేధాన్ని ప్రచారం చేసిన గొప్ప అహింసా వాదని కలెక్టర్ తెలిపారు.
గోవు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాటిని కాపాడే దిశగా కృషి చేసిన మహానీయుడని కలెక్టర్ కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.