స్థానికత సిఫార్సుల ఆమోదం తర్వాతే జారీ
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): బీటెక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్ తదితర కోర్సు ల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్స్)ల నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది.
ఇప్పటికే ఎనిమిది ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూ ళ్లను ఖరారు చేసిన అధికారులు ఇక నోటిఫికేషన్ల విడుదలపై దృష్టిసారించారు. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్‌సెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు, ఈసెట్ మే 12, ఎడ్‌సెట్ జూన్ 1, లాసెట్ జూన్ 6, పీజీఎల్‌సెట్ జూన్ 6, ఐసెట్ జూన్ 8, 9, పీజీఈసెట్ జూన్ 16 నుంచి 19, పీఈసెట్ జూన్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
బీటెక్, ఇతర ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్‌ను నిర్ధారించేందుకు విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసిన తర్వా త వీటికి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 15 శాతం కోటా సీట్లకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు పోటీపడేలా కమిటీ సిఫార్సులు చేసే అవకాశం ఉంది.