calender_icon.png 16 January, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు ఎదురుదెబ్బ!

16-01-2025 03:25:36 AM

సుప్రీంలోనూ బెడిసికొట్టిన ఫార్ములా

క్వాష్ పిటిషన్ కొట్టివేత.. పిటిషన్ ఉపసంహరణకు అనుమతి

* ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపరుడా? కాదా? అంటే.. చెరువులో ఉన్న చేప నీళ్లు తాగుతుందా? లేదా? అన్నట్లు ఉంటుంది.

 జస్టిస్ బేలా ఎం త్రివేది

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సుప్రీ కోర్టులో  చుక్కెదురైంది. హైకోర్టులో దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేయ డంతో సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదు. ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలన్న కేటీఆర్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఏ దశలోనూ కేటీఆర్ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేందుకు సుప్రీం కోర్టు సమ్మతించలేదు.

లలితకుమారి, చరణ్ సింగ్ కేసుల్లో ఘటన జరిగిన చాలా కాలానికి నిందితులపై కేసు నమోదు చేయడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించినప్పటికీ అవి కేసును కొట్టేసేందుకు ప్రామాణికం కాదని తేల్చిచెప్పింది. నేరపూరిత ప్రవర్తనకు పాల్పడిన ట్లుగా అభియోగాలు లేనప్పుడు తనపై అవినీతి నిరోధక చట్టంలోని 13(1) (ఎ) సెక్షన్ కింద కేసు పెట్టడానికి వీల్లేదన్న వాదనను సైతం తోసిపుచ్చింది.

ఫార్ములా ఈ-రేసు ఒప్పందం చేసుకున్న సంస్థ, హెచ్‌ఎండీఏ ఇక్కడే ఉన్నాయని, వాళ్లపై కేసు పెట్టకుండా ఆనాటి మంత్రిగా ఉన్న పిటిషనర్ కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదంటూ చేసిన వాదనను కూడా కొట్టివేసింది. ఒక్క రూపాయి కూడా పిటిషనర్ కేటీఆర్ తీసుకోనప్పడు, ఒక్క రూపాయి కూడా మంత్రి గా కేటీఆర్ చెల్లించనప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ 24 గంటల్లోగా ఎలాంటి దర్యాప్తు చేయకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదన్న వాదన సైతం వీగిపోయింది.

ఒక దశలో ధర్మాసనం కల్పించుకుని, ‘అధికారుల అవినీతి.. చెరువులో చేపలు నీళ్లు తాగుతాయా..?’ అన్నట్టుందని ఘాటు వ్యాఖ్య చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన 24 గంటల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారా అని నిలదీసింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తే తిరిగి హైకోర్టుకు వెళతామని న్యాయ వాది కోరగా, అందుకు కూడా సుప్రీం అంగీకరించలేదు. కేటీఆర్ న్యాయవాది పలుసా ర్లు విజ్ఞప్తి చేసిన తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి మాత్రమే ఇచ్చింది.

తిరిగి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసుకునేందుకు కేటీఆర్‌కు అనుమతివ్వ లేదు. కనీసం అప్పీల్‌ను పిటిషనర్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది పలుమార్లు కోరారు. దీనికి ప్రభుత్వం తరఫున న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. సుప్రీం కోర్టు కూడా ‘మీకు (కేటీఆర్) ఆ స్వేచ్ఛ లేదు..’ అని వ్యాఖ్యానించింది.

పిటిషన్‌లోని పత్రాలు సరిగ్గా లేకపోయినా, సాంకేతికంగా ఏమైనా లోటుపాట్లు ఉన్నా పిటిషన్ ఉపసంహరణ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉంటుందని గుర్తు చేసింది. పలుసార్లు కేటీఆర్ న్యాయవాది కోరడంతో పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూనే అప్పీల్ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న బి. వరాలే లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

తొలుత పిటిషనర్ కేటీఆర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదిస్తూ, తెలంగాణ రాష్ట్ర సర్కార్ కక్షపూరితంగా, రాజకీయ దురుద్దేశంతో, ఏకపక్షంగా ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ద్వారా కేసు నమోదు చేసిందన్నారు. నిధుల దుర్వినియోగం అనేదే లేదని, అయినా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు.

ఒక్క రూపాయి కూడా పిటిషనర్ కేటీఆర్‌కు చెల్లించనప్పడు ఆ సెక్షన్ కింద ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఎలా చెబుతుందని నిలదీశారు. ఒక్క నయాపైసా లావాదేవీలతో పిటిషనర్‌కు సంబంధం లేనప్పుడు అవినీతి జరిగిపోయిందని ముందే ఒక నిర్ణయానికి ఎలా వస్తారని నిగ్గదీశారు. ప్రభుత్వం చెప్పినట్లుగా అభియోగాలన్నీ కాసేపు నిజమేనని అనుకున్నప్పుడు నిధులు పొందిన సంస్థను గానీ, ఒప్పందం చేసుకున్న హెచ్‌ఎండీఏను గానీ నిందితులుగా ఎందుకు చేర్చలేదనే ప్రశ్నను సంధించారు.

విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54 కోట్ల చెల్లింపులు జరిగాయనే అభియోగానికి, సదరు 13(1)(ఎ) సెక్షన్‌ను ఏవిధంగా సంబంధమో అర్ధం కావడం లేదన్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణ వల్ల ప్రభుతానికి రూ.700 కోట్ల మేరకు లబ్ధి చేకూరిన విషయానికి పాలక ప్రభువులు తిలోదకాలు ఇచ్చేశారని తప్పుపట్టారు. ఏ విధంగా చూసినా, ఒకవేళ తప్పుడు కుట్ర కేసులోని ఆరోపణలు నిజమేనని అనుకున్నా కూడా పీసీ యాక్ట్ సెక్షన్ 13(1) (ఎ) సెక్షన్ కింద కేసు పెట్టడానికి నేరపూరిత ప్రవర్తన పిటిషనర్‌కు ఎక్కడా లేదన్నారు.

ఒక్క ఆధార ం ఏసీబీ దగ్గర లేకపోయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పిటిషనర్ కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయాలనే ప్రభుత్వ దురుద్దేశమన్నారు. స్పాన్సర్స్ వెళ్లిపోవడంతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం రాకూడదనే ఆనాటి మంత్రి హోదాలో పిటిషనర్ చొరవ తీసుకుని ఫార్ములా ఈ రేసు కొనసాగేలా చేయడమే నేరమా అని ప్రశ్నించారు. ఒక్కసారి ఎఫ్‌ఐఆర్‌ను చూస్తే అన్నీ అర్ధం అవుతాయన్నారు.  అవినీతిని ఉందం టూ వర్తించని 13(1)(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదన్నారు.

తప్పు చేయలేదని ఎలా చెబుతారు..

డిసెంబర్ 18న కేసు ఫైల్ అయితే.. 24 గంటల్లోనే ఎఫ్ ఐఆర్‌ను  కొట్టేయాలని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వ తరపు సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గి వాదించారు. వెంటనే ప్రొటెక్షన్ తెచ్చుకున్నారని చెప్పారు. దర్యాప్తు చేసేందుకు టైం ఇవ్వకుండానే.. తప్పు చేయలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై సుందరం వాది స్తూ.. హెచ్‌ఎండీఏ సాయంత్రం 5:30కు కంప్లైంట్ చేస్తే, మరుసటి రోజు ఉదయమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వాదించారు. లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అరెస్ట్ చేయాలని, ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

అందువల్లే తాము కోర్టుకు వచ్చామన్నారు. పీసీ యాక్ట్ ప్రకా రం చరణ్ సింగ్ దాఖలైన కేసులో ఆచితూచి వ్యవహరించి, ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. ఇందుకు రోహిత్గి బదులిస్తూ.. ఈ కేసు వ్యవహారంలో గవర్నర్ అనుమతి తీసుకున్నామని తెలిపారు. గవర్నర్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని కోర్టుకు నివేదించారు. మధ్యలో జస్టిస్ బేలా ఎం త్రివేది స్పంది స్తూ.. ఈ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసేందుకు చరణ్ సింగ్ కేసు ఉదాహరణగా తీసుకోలేమని స్పష్టంచేశారు.      

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఎలా కోరతారు?

నిజానిజాలు తేలాలంటే ఇది విధానమే కాదని సుందరం అన్నారు. లీలావతి, చరణ్ సింగ్ కేసుల్లో సుప్రీం కోర్టు జారీ చేసిన తీర్పులకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేసులో తీవ్ర జాప్యంతో ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. పీసీ యాక్ట్ కింద కేసు నమోదులో జాప్యం జరిగితే ఆచితూచి వ్యవహరించాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారన్నారు. గత డిసెంబర్ 18న సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు అందితే, ఆ తర్వాత రోజునే ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదన్నారు.

ఫిర్యాదు అందాక ఎలాంటి దర్యాప్తు చేయకుండానే ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారన్నారు. ఇలా చేయడం చరణ్ సింగ్, లీలావతి కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను కాలరాయడమేనని చెప్పారు. ఈ కారణంగా కేసును కొట్టేయాలని లేదని న్యాయమూర్తి జస్టిస్ త్రివేది అన్నారు. ఈ దశలో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ కల్పించుకుని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కొంతకాలం మధ్యంతర ఉత్తర్వులు పొందారని చెప్పారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే హైకోర్టు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు పొందారని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ దశలో కేసు విచారణ జరగకుండా కొట్టేయాలని పిటిషనర్ కోరడం చట్ట వ్యతిరేకమ న్నారు. చరణ్ సింగ్ మరో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసులో వర్తించవన్నారు. ఫార్ములా ఈ- రేసు అక్రమాలపై సమాచారం అందాక అధికారులు లోతుగా పరిశీలన, అధ్యయనం చేశాక ఒక నిర్దారణకు వచ్చారని, ఆ తర్వాత గవర్నర్ నుంచి చట్ట ప్రకారం అనుమతి పొందాకే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు.

రేసింగ్ పేరుతో ఇష్టానుసారంగా డబ్బు చెల్లింపులు జరిపి, ఆపై అదేదో ప్రజాశ్రేయస్సు కోసమన్నట్లుగా చెప్పుకోడానికి వీల్లేదన్నారు. ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసి చెల్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయో, ఆక్కడి నుంచి ఇంకెవరికి ముట్టాయో తేలాల్సివుందన్నారు. పిటిషన్‌ను వాపస్ తీసు కునేందుకు కూడా వీల్లేదని, సుప్రీంకోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత సుప్రీం కోర్టు, కేటీఆర్ న్యాయవాది వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూనే ఆయన వేసిన ఎస్‌ఎల్పీని కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.

సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పులో ఏసీబీ ఫార్ములా ఈ-రేసుపై దర్యాప్తునకు న్యాయపరంగా అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు కూడా అవరోధాలు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫార్ములా ఈ- రేసు లో మొదటి నిందితుడిగా కేటీఆర్ కేసు విచారణను ఎదుర్కొనడమే మిగిలిన ఏకైక మార్గమని రాజకీయ పండితులు చెబుతున్నారు.

చెరువులోని చేప నీళ్లు తాగుతుందా? లేదా? 

విదేశీ నిధుల చెల్లింపుల నిబంధనలు పాటించలేదని, ఆర్బీఐ అనుమతి పొందలేదన్న ఆరోపణలు కాసేపు నిజమే అని ఒప్పుకుంటే, అవి అవినీతి నిరోధక చట్టం 13(1)(ఏ) కిందకు రాదని సుందరం అన్నారు.  కాబట్టి ఏసీబీ దర్యాప్తు చెల్లదన్నారు. మరోసారి జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకొని కీలక కామెంట్స్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపరుడా? కాదా? అంటే.. చెరువులో ఉన్న చేప నీళ్లు తాగుతుందా? లేదా? అన్నట్లు ఉంటుంది’ అని అన్నారు.

ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకొని.. ‘రేసులు పెట్టారు. చట్టాలను ఉల్లంఘించారు. ఇష్టం ఉన్నవారికి చెల్లింపులు చేశారు. ఇప్పుడు వచ్చి అంతా ప్రజల కోసమే చేశాం. కేసు వద్దు.. అంటున్నారని చెప్పారు. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవద్దని రోహిత్గి ధర్మాసనాన్ని కోరారు.