calender_icon.png 4 October, 2024 | 6:53 AM

సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి

04-10-2024 02:05:59 AM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లు

పిటిషనర్లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు 

హైదరాబాద్ , అక్టోబర్ 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూలును రూపొందించడాని ఈ పిటిషన్లను తక్షణం అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని, ఆపైన నిర్ణయించిన షెడ్యూలును కోర్టుకు సమర్పించాలంటూ గత నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు హైకోర్టులో రెండు అప్పీళ్లు దాఖలు చేశారు.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్యొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం కోర్టుకు ఉందా? లేదా అన్న వివాదాన్ని తేల్చాల్సి ఉందని, దీనిపై ఈ నెల 24న తుది విచారణ చేపడతామని, ఈలోగా ఏవైనా చర్యలు తీసుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.