రాజ్‌తరుణ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందం పాల్గొని మాట్లాడారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా. వినోదం, భావోద్వేగం వంటి అన్ని అంశాలున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడొచ్చు. మాల్వీ మల్హోత్రాకిది తొలి తెలుగు సినిమా.
ఆమెను తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కోరుకుంటోంది.. వివాదాలన్నీ పక్కనపెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘మంచి టీమ్‌తో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ మరెన్నో సినిమాలు చేయాలని ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలు కావాలి’ అని మాల్వీ మల్హోత్రా అన్నారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘భార్యాభర్తల అనుబంధం గురించి సినిమాలో చూపించాం. తన భార్యను కాపాడుకోవటానికి ఓ వ్యక్తి ఏవిధంగా పోరాటం చేశాడనే అంశాన్ని సినిమాలో చూపించాం’ అని పేర్కొన్నారు.
లావణ్య ఆరోపణలపై లీగల్‌గా వెళ్తున్నా..
అయితే, ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య పెట్టిన ఆరోపణల కేసును ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాజ్ తరుణ్ సమాధానమిచ్చారు. లావణ్య వివాదంపై రాజ్‌తరుణ్‌తోపాటు మాల్వీ మల్హోత్రా స్పందించారు. ‘లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఈ విషయంలో లీగల్‌గా వెళ్తున్నా. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. లావణ్య ఎఫ్‌ఐఆర్‌లో అబార్షన్ గురించి లేదు. నిజమే అయితే మెడికల్ ఆధారాలు బయటపెట్టాలి. జీవితంలో పెళ్లి గోల వద్దనుకుంటున్నా.
ఉద్దేశపూర్వకంగా నాపై ఆరోపణలు, నిందలు చేస్తున్నారు. ఈ కారణంగా నాతోపాటు నా పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు’ అని రాజ్‌తరుణ్ అన్నారు. ‘లావణ్య చేస్తున్న ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. 2020లో నాపై దాడి చేసిన కొందరు క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు టచ్‌లో ఉంది. వాళ్లతో టచ్‌లో ఉండొద్దని చెప్పినా వినలేదు. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్. ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను. లీగల్‌గా ఫైట్ చేస్తా’ అని మాల్వీ మల్హోత్రా తెలిపారు.