నేడు గుంటూరు శేషేంద్రశర్మ జయంతి
‘ఋతుఘోష’ అనే పద్యకావ్యాన్ని శేషేంద్ర 1963లో ప్రచురించినాడు. కాళిదాసు ఋతువులను వర్ణించింది మొదలుగా పలువురు కవులు ఋతువులను వర్ణించినారు. ప్రబంధ కవులు కథా సందర్భాన్ని పురస్కరించుకొని ఋతువులను వర్ణించినారు. రాయలు తన ‘ఆముక్త మాల్యద’లో చేసిన ఋతువర్ణనలు సుదీర్ఘమైనవి. ఆధునిక కాలంలో విశ్వనాథ మొదలైన కవులు ప్రత్యేకంగా ఋతువులను వర్ణిం చారు. ఆయా ఋతువుల్లోని సుందర మైన ప్రకృతినే కవులు చిత్రించినారు. శేషేంద్ర చేసిన వర్ణనలు ఒక ప్రత్యేకమైనవి. ఋతువుల అం దచందాలను కాకుండా ఆయా ఋతువుల్లో బాధపడే పేదలను, కార్మికులను, కర్షకులను చిత్రించి నాడు. ఆయా ఋతువుల్లో దీనజనులు చేసే ఘోష ‘ఋతుఘోష’. వసంతం మొదలుగా శిశిరం వరకు గల ఆరు ఋతువులను చిత్రిస్తూ పేదల బాధలనే శేషేంద్ర చిత్రించినాడు. వసంత ఋతువులోని మధ్యాహ్న సమయాల్లో ‘కూలీ జనుల్ మదిలో గుందుచు చేలలో దిరిగినారని’ మొదటిసారి కూలీ జనులను పేర్కొన్నాడు. ‘వసంతంలోని పూలు ఇతణ్ణి చూచి వెక్కిరించినాయి’ అంటాడు కవి.
“చేలంబూవులు వెక్కిరించె,
గగన శ్రీ చంద్రరేఖాంకయై
వేళాకోళము జేసె, తాళవనిలో
వేలాది తారావళుల్
గోలం జేసెను, చింతకొమ్మ పయినం
ఘూకంబు శోకించె, నా
కూలీవాడు కుటీర గర్భమున నా
క్రోషించే దైన్యంబుగన్”
వసంత కాలంలోని ప్రకృతి, కూలీవానికి ఆక్రోశాన్నే కలిగించింది. నింగి, నేల సమస్త విశ్వం అతనికి చీకటిగానే ఉందంటాడు. ఆనందాన్ని పంచదగిన చెట్లకొమ్మలు అతనికి జుట్టు విరబోసుకొని సంచరించే దయ్యాలుగానే దర్శనమిస్తున్నాయి. గ్రీష్మర్తువును వర్ణిస్తూ, శేషేంద్ర రిక్షా కార్మికుడు, బం డలు మోసే అభాగ్యుల కష్టాలను చిత్రించినాడు.
“వివిధ నిమ్నోన్నత వీథులం బరుగెత్తి
వైశాఖలో మేను వాల్చె నొకడు....
మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి
గుంటూరులో కుప్పగూలె నొకడు
కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి
నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు
క్రూర దారిద్య్ర దుర్విధి కారణమున
తన భుజాగ్రము నెక్కు భేతాళ మూర్తి
సర్వ కాలానువర్తి రిక్షా ధరించి
లాగలేకను వేసవి కాగలేక”
రిక్షా త్రొక్కకుండా బ్రతుకు గడవదు. ఎండల్లో ఎత్తు పల్లాల వీథుల్లో రిక్షా తొక్కితే శక్తి చాలక ఎక్క డో ఒకచోట సొమ్మసిల్లి పడిపోక తప్పదు. అప్పుడతనికి ఏ దిక్కు లేకపోయిన విషయాన్ని కవి, పాఠకు ల ఊహకు వదిలినాడు.. ఎండల్లోనే కొండరాళ్ళను పగులగొడుతున్నారు. వాటిని బండ్లమీద పేర్చి పురవీధుల్లో లాగుతున్నారు. దేశంలో ఇటువంటి వారు వందలు, వేలు, కోట్లు. వీరిని చూచిన కవి గుండెలో అగ్ని చెలరేగుతుంది.
“కొండల గండభాగముల
గూల్చి శిలాఫలకమ్ము లేర్చి పే
రెండల ధాటికోర్చి శ్రమి
యించి పురీ పరిణాహ వీధులం
బండలు లాగుచుం
బ్రతుకు భారము మోయు నభాగ్య కోట్లు
నా గుండెలలోన నగ్ని దరి
కొల్పును తీవ్రనిదాఘ వేళలన్”
‘సమస్త దీన జీవనములు పల్లవించి సుఖవంతములైనప్పుడే తనకు శాంతి’ అంటున్నాడు కవి.
వర్షర్తువు ధనికులకు సుఖాన్నిస్తున్నట్టు, పేదలకు దుఃఖాన్ని కలిగిస్తున్న ట్లుగా కవి వర్ణించినాడు.
“ఒకనికి గండభేరుండ శుండాలంబు
లొకనికి మకరధ్వజోత్కరంబు ....
ఒకనికి సమవర్తి హుంకార కింకరుల్
ఒకనికి ప్రియదూత నికర లీల....”
ఇదేమి ధర్మమంటున్నాడు శేషేంద్ర. ‘దీనజనుల మీద సాగే దౌర్జన్య చర్య ఇది’ అంటున్నాడు. ప్రకృతియే ఇట్లా అధర్మంగా ప్రవర్తిస్తుందేమిటి? పేదల ను పీడించే పర్జన్యుడు ధనికులను పీడించడానికి భయపడుతున్నాడని చెప్పి పక్షపాత ధోరణిలో సా గే ప్రభుత్వ పాలనారీతిని సూచిస్తున్నాడు. కవి
“ఏమి ధర్మంబు భాగ్యవిహీన దీన
జనుల మీదనె దౌర్జన్య చర్యగాని
హేమధామ సముద్దామ సీమలందు
అడుగుపెట్టంగ వెఱచు పర్జన్యుడైన”
వర్షం వల్ల పేదలు పీడింపబడుతున్నారు. సౌ ధాల్లో నివసించే వారు ఆనందిస్తున్నారు. ఆనందం తో వీరు చేసే కేరింతలు, పేదలకు విన్పించగా గుం డెలు మండుతున్నాయి. ధనికులపట్ల పేదలకు ఇ ట్లా క్రోధం కలుగటం సహజమంటున్నాడు కవి
“భోగ విలాస వాసనా
జనిత మద ప్రలాపములు
శల్యములై వినిపించుచుండగా
మనము సముజ్జ్వలజ్వలన
మాలికలంబడి మ్రగ్గకుండునే”
ఈ పేదల స్థితిని చూసే కవి తన గుండె క్రోధం తో జ్వలిస్తుందంటున్నాడు. శాంతించటం అసాధ్యమంటున్నాడు. “కర్కోటక క్రూరమౌ చలిలో బీదల బాధలం దలచినన్ శాంతింపగా సాధ్యమే.”
శరత్తును వర్ణిస్తూ శేషేంద్ర పేదల కష్టాలనే పేర్కొన్నాడు. యుగయుగాలుగా లోకంలో పేద జను లుంటూనే ఉన్నారు. కాలం మారుతుంది. పేదల జీవితాల్లో మార్పు లేదు. ఋతువులు మారుతున్నాయి. మేఘాలు వర్షిస్తున్నాయి. చెట్లు చిగిరిస్తు న్నాయి. లతలు పూస్తున్నాయి. చంద్రుడు పిండి వెన్నెలల నారబోస్తున్నాడు. ప్రకృతిలో ఇన్ని మార్పులను తెచ్చే ఋతువులు పేదల బ్రతుకుల్లో మార్పు తేవటం లేదు కదా! అంటున్నాడు కవి- లు
‘
‘ఋతువులు మారుగాక, జ్వలి
యించు క్షుధా వ్యధితోగ్ర జీవన
క్రతువులు మారెనే? యుగయు
గమ్ముల భారమొకింత తీరెనే”
కవి, ధనికుల జీవితాలను, పేదల జీవితాలను పరిశీలిస్తున్నాడు. ఏ ఋతువులోనైనా ధనికులానందిస్తున్నారు. వీరు పరితపిస్తున్నారు. ఋతువు లే వారికి అందించే ఆనందాన్ని, వీరికి అందించ టం లేదు. ఎందుకు? జవాబు లేని ప్రశ్న ఇది
“లోకమున కెల్లనమృతాభిషేక మొసగి
పరుగులెత్తెడి యందాల పాలవెల్లి
పండువెన్నెల రాదేల పంతగించి
చితికిపోయిన దీనులు జీర్ణకుటికి”
హేమంతమును వర్ణిస్తు, శేషేంద్ర పేదల పక్షం వహించి మా చీకటింట వెలుగును నింపగా రమ్మ ని సూర్యునికి విన్నపం చేస్తున్నాడు. కమలవనంలో కాంతులు నింపే సూర్యుడు చీకటింటివైపు రావటం లేదు. ఇది సూర్యుని పక్షపాత వైఖరి. నీ రాక కోసం నిరీక్షిస్తున్నాం. కన్నులు కాయలు కాస్తున్నాయి. కాని, నీవు రావటం లేదు. సూర్యుని వెలుగు కమలవనం మీద కాని, చీకటింట కాని సమానంగానే కురియాలి. కాని, అట్లా కావటం లేదు. ఒక పనిచేసి మరో పని చేయటం లేదు సూర్యుడు. వెలుగును కమలవనం మీద ప్రసరింపజేస్తేనే సరిపోదు అని సూర్యుని నిలదీస్తున్నాడు కవి
“భ్రమరము మ్రుచ్చులించి మకరందము
లెల్లను శూన్య మైనయా
కమల వనమ్ములో పసిడి కాంతులు
చిల్కిన చాలదోయి మా
తిమిర గృహాంతరాళముల దీపము
వెట్టుము కన్నుదోయి నీ
యమల మయూఖ రేఖలకు అర్రులు
సాచెను లోక బాంధవా”
లోకానికి కంతటికి బాంధవుడవైన నీకిది తగదని సూర్యునికి కవి సూచిస్తున్నాడు. చీకట్లో బాధ పడే దీనులకు, వెలుగు చూపగలిగితేనే సూర్యకిరణాలకు సార్థక్యమంటున్నాడు. ఎక్కడో మేడల్లో సంచరిస్తుండటం వల్ల ప్రయోజనం లేదని, అది అడవిగాచిన వెన్నెల వంటిదన్న సూచన చేస్తున్నాడు. ఈ ప్రజా స్వామ్యంలో పేద జనోద్ధరణ యే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నది విషయం -
“తిమిరములోన బాధపడు
దీనజనాళికి దారి జూపి నీ
యమల మయూఖమాల
చరితార్థము చేయక లాలిలతా
సుమ సముదాయ మూర్తివయి శూన్య
పఠనమ్ముల సంచరించుచున్
హిమరమణీయ సౌధముల నెచ్చటనో
వసియింతువా ప్రభూ!”
నీరాక కెదురుచూస్తున్న ‘శిథిల జీవుల’పై జీవకాంతులు ప్రసరింపజేయ టానికి తెరలు తొలగిం చి రావోయి అని హేమంత మందలి ‘అరుణమూర్తి’కి విన తి చేస్తున్నాడు కవి.
‘ఋతుఘోష’ కావ్యంలోని చివరి ఋతువు శిశిరం. దీనికి శేషేంద్ర ‘శిశిరఘోష’ అని పేరు పెట్టినాడు. ఇదివరకున్న ఋతువులకిట్ల ‘ఘోష’యని లేదు. ఆయా ఋతువుల్లో పేదల బాధలే ప్రధానంగా చిత్రింపబడినాయి. అయినప్పటికీ, కవి, ఈ ఒక్కచోటనే ‘శిశిరఘోష’ అని వ్రాసినాడు. మరింత నొక్కి చెప్పటానికే కావ్యాంతంలోని ఋతువును ఇలా పేర్కొన్నాడు. హేమంత సూర్యుణ్ణి, పేదలింట వెలుగులను నింపగా రమ్మ ని ప్రార్థించినట్లుంది. ఇంతవరకు పేదలకు ఆయా ఋతువులు కలిగిస్తున్న బాధను గ్రహించటం వల్ల కవికి కలిగిన క్రోధం ఒక హద్దులో ఉంది. ఈ ఋతువర్ణనలో ఆ క్రోధం బద్దలయింది. ఇల్లు లేకుండ, ఊరు బయట చెట్లనీడల్లో బ్రతుకు నీడ్చేవారి ‘పసిపాపల’ను పేర్కొన్నాడు కవి. ఊరు బయట పెను మట్టిచెట్టు క్రిందనున్న పసిపాపలు చలికి వణకి నశిస్తున్న విషయాన్ని చెప్పి, కాలమే హాలాహలమైందన్నాడు.
దేవుడా! నీవున్నావా!
ఎటైనా పారిపోయినావా!
పేదల బాధలను తొలగింపలేక
శిలయై పోయినావా!
చెప్పుమంటున్నాడు. ధనవంతుల దుర్మార్గాలను కాపాడే దేవునికి పేదల కష్టాలు తెలియనే తెలియవంటున్నాడు.
“సౌధవీథికల నానందించు దుర్మార్గ వర్గములంబ్రోచెడు దేవుడేమెరుగు నిర్భాగ్య ప్రజాకోటి దుర్దమ బాధామయ జీవితానుదిన గాధాగర్భ సందర్భముల్” ప్రతి రోజు పేదలు పడే బాధలు ఇన్నీ అన్నీ కావు. నిజంగా దేవుడుంటే అతడు పేద ల బాధలను చూస్తున్నవాడే అయితే, ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా వారి బాధలను తొలగించేవాడే. ఈ ఋతువులోను బాధలే. ఏ ఒక్క ఋతువుకూడా తమకానందాన్ని అందివ్వక పోతుండటా న్ని గ్రహించిన పేదవానికి క్రోధం పట్టరానిదైంది. చివరి ఋతువు కూడ తమ బ్రతుకుల మీద హాలాహలాన్నే చిమ్మింది. హృదయాగ్ని పర్వతం బ్రద్దలయింది. తుచ్ఛమైన లోకం నాశనం కావటాన్నే కోరుకొన్నాడు.
“ఏలాగో ఒకనాడు ఆ శిశువులే
యింధాన మౌగాక, యు
ద్వేలక్షోభ నభోంతరాళ మెగయన్
విశ్వ ప్రజాలోచనో
న్మీలంబై హృదయాగ్ని పర్వత మహా
నిర్ఘోష రోషానల
జ్వాలాజాలకరాళ జిహ్వ క్రలు తు
చ్ఛంబైన యీ లోకముం
గూలంజేయును గాక; యీ వచనమే
ఘోర్ణిల్లు గాకంతటన్”
ఇది ‘ఋతుఘోష’ కావ్యాంత పద్యం. సమాజం నుండి పేదరికాన్ని నేటి శిశువులే పూనుకొని తొలగించ గలుగుతా రన్నది సూచన. వసంత ఋతువు మొదలైన ప్రతి ఋతువులోను దీనజనుల బాధలనే శేషేంద్ర ప్రధానంగా చిత్రించినాడు. ఏ కాలం లోనైనా పేదల కష్టాలు తీరక పోవటాన్ని గమనించిన కవి, సంవత్సరంలో కనీసం ఏ ఒక్క ఋతువు లోనైనా సుఖపడటం లేదన్న విషయాన్ని నొక్కి చెప్పటానికే ఇట్లా ఋతువర్ణనలను చేసినాడు. పేద ల కష్టాలతో మమేకమైనాడు. వారి బాధను తన బాధగా భావించినాడు. వారి కష్టాలను చూడ గా తన గుండెలలోనగ్ని ప్రజ్వరిల్లిందనటం సమస్త దీన జీవనములు పల్లవించి సుఖవంతము లైనప్పుడే తన మనసు ‘శమి’స్తుందని చెప్పటం కవికి దీనజనులపట్ల గల సహానుభూతిని, ప్రేమను, గౌరవాన్ని తెలుపుతుంది. శేషేంద్రకు శ్రామికులపట్లగల కారు ణ్య దృష్టికి ‘ఋతుఘోష’ కావ్యమొక నిదర్శనం.
- ఆచార్య అనుమాండ్ల భూమయ్య