24-03-2025 12:00:00 AM
కొండపాక, మార్చి 23: చిన్నారుల గుండెకు రంధ్రం పడితే చిన్నారులకు సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్ హార్ట్ రీసెర్చ్ సెంటర్ అందిస్తున్న సేవలు చాలా గొప్పవని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిసిపి శ్వేత అన్నారు. ఈనెల 13 నుంచి 22 వరకు మూడవ సెషన్లో 23 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ లను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఆదివారం గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథులుగా డిసిపి శ్వేత పాల్గొని గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న అభాగ్యులకు సత్యసాయి సేవలు అందడం అదృష్టం, ఇదంతా దైవం చేపిస్తున్నట్టుగా ఉందని పేర్కొన్నారు.
ఇది భగవత్ కార్యక్రమం దీనిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, సేవా తత్పరతను పెంపొందించుకోవాలని తెలిపారు. చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం కావడంతో ఈరోజు వారి కళ్ళల్లో కనబడుతున్న ఆనందం చెప్పరానిదని, ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా కొండపాక ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రి ఏర్పడటం ఇక్కడి ప్రజల అదృష్టం, త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందుతుందన్నారు. సత్య సాయి సంజీవని ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొండపాక ప్రాంతంలో సత్య సాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్ హార్ట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పడడం భగవత్ సంకల్పమేనని అన్నారు.
నవంబర్ చివరి వారంలో ఆపరేషన్ల ప్రక్రియ ప్రారంభమై మొదటి సెషన్ లో 28, రెండవ సెషన్ లో 32, మార్చి నెలలో 10 రోజుల్లో 23, మొత్తం 83 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మార్చ్ నెలలో చేసిన గుండె ఆపరేషన్ మొత్తం తెలంగాణ మారుమూల ప్రాంతాలకు చెందిన వారేనని తెలిపారు.
చిన్నారుల గుండె చంద్రమైతే వారికి మా ఆసుపత్రి జీవనాధారంగా నిలవడం దైవ సేవగా భావిస్తున్నామని, కార్పొరేట్ కు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ చిన్నారులను కాపాడడమే గేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.
విద్యతో స్కిల్ డెవలప్ కావాలనే అదే స్కిల్ సేవగా మారాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధి జగన్నాధ శర్మ, సత్య సాయి బాలికల కళాశాల ప్రతినిధి పూర్ణిమ, వైద్యులు ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.