calender_icon.png 9 October, 2024 | 7:48 PM

10 నెలల కనిష్ఠానికి సేవల రంగం

05-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: కొత్త ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాలు మందగించడంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో దేశంలోని సర్వీసుల రంగం కార్యకలాపాలు 10 నెలల కనిష్ఠానికి తగ్గాయి. శుక్రవారం విడుదలైన హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్ నెలలో 57.7కు తగ్గింది. ఆగస్టులో ఇది 60.9 మేర ఉన్నది. సేవల రంగంలో 2023 తర్వాత ఇంత మందకొడి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి.

పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం ఇండెక్స్ 50 ఎగువన ఉంటే వృద్ధిగానూ, 50 లోపు ఉంటే క్షీణతగానూ పరిగణిస్తారు. సెప్టెంబర్‌లో నమోదైన 57.7 మందకొడి వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక సగటుకంటే అధికంగానే ఉన్నదని హెచ్‌ఎస్‌బీసీ సీనియర్ ఎకానమిస్ట్ ప్రంజుల్ భండారీ చెప్పారు. ముడి వ్యయాలు పెరగడం, సేవల ధరలు అంతగా పుంజుకోకపోవడంతో సర్వీసుల రంగం లాభాల మార్జిన్లు మరింత తగ్గాయని భండారీ వివరించారు.