పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా నియమితులైన ఏఈఈలు నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఈఈలకు అభినందనలు తెలిపారు. మీ పనితనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు.
శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు ఉండాలని, మీ కుటుంబానికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టేలా పనులు చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగం సాధించేందుకు ఎంత కష్టపడ్డారో.. విధులను సక్రమంగా నిర్వర్తించడలో అంతే నిబద్ధతను చూపాలన్నారు.