calender_icon.png 21 December, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

08-10-2024 12:56:51 AM

జహీరాబాద్-బీదర్ రోడ్డుపై బైక్‌ను ఢీకొట్టిన కర్ణాటక బస్సు 

బైక్‌పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సంగారెడ్డి, అక్టోబర్ 7 (విజయక్రాంతి)/జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు.

వివరాలిలా ఉన్నాయి.. న్యాల్‌కల్ మండలంలోని గణేశ్‌పూర్ గ్రామానికి చెందిన సిద్ది రామప్ప(71), అతని అల్లుడు జగన్నాథ్ (42), కుమార్తె రేణుక(36), మనవడు వినయ్‌కుమార్(14) సోమవారం పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గణేశ్‌పూర్ గ్రామ శివారులో జహీరాబాద్-బీదర్ రోడ్డు దాటుతున్న క్రమంలో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సిద్ది రామప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. జగన్నాథ్, రేణుక, వినయ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బీదర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. కొద్ది క్షణాల్లో ఇంటికి చేరాల్సిన వారిని మృత్యువు కబళించడంతో మృతుల కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంత్, హద్నూర్ ఎస్సై రామనాయుడు సందర్శించి వివరాలు సేకరించారు. డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపా రు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.