calender_icon.png 24 October, 2024 | 2:17 AM

సిరీస్ పట్టారు

14-07-2024 12:50:32 AM

హరారే: జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శనివారం హరారే వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అజేయ అర్థసెంచరీలతో జైస్వాల్, గిల్‌లు జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరుమాని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్, దూబేలు తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 156 పరుగులు చేసి అజేయ విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ ( 53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడి వరుసగా రెండో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అజేయ అర్థసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3 సొంతం చేసుకున్న టీమిండియా నేడు జింబాబ్వేతో నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది.