calender_icon.png 21 September, 2024 | 8:02 AM

‘వరుస రైలు ప్రమాద’ కుట్రలు ఎక్కువకాలం దాగవు

18-09-2024 02:09:08 AM

  1. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అసంబంధ వ్యాఖ్యలు 
  2. కేంద్ర హోంమత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: వరుస రైలు ప్రమాదాల వెనుక ఏదైనా కుట్రకోణం ఉంటే త్వరలోనే వెలికితీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. కుట్రలు ఎక్కువ రోజులు దాగవని స్పష్టం చేశారు. దేశంలో 1.10లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ ఉందని, ఈ నెట్‌వర్క్‌ను మరింత సురక్షితంగా ఉంచేందుకు త్వరలోనే కీలక చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైల్వే సెఫ్టీపై ఆ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో తాను చర్చించినట్లు అమిత్‌షా పేర్కొన్నారు. రైల్వే ప్రమాదాల మూలకారణాలపై దర్యాప్తు చేస్తామని, ఏవైనా లోపాలుంటే సవరించుకొని.. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

మోదీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 38 రైలు ప్రమాదాలు జరిగాయంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేయగా, వాటిని షా కొట్టిపారేశారు. బీజేపీ హయాంలోనే రైల్వే నెట్‌వర్క్ విస్తరించినట్లు స్పష్టం చేశారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక 8 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదముద్ర లభించిన ట్లు పేర్కొన్నారు. ఇటీవల కొందరు దుండగులు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు పెట్టి ప్రమాదాలు జరిగేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ ఏడాది జూన్ నుంచి ఇలాంటి 24 ఘటనలు జరిగాయని కొన్నాళ్ల క్రితం రైల్వే శాఖ తన నివేది కలో పేర్కొంది. అత్యధికంగా యూపీ ఆ తర్వాత పంజాబ్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఎంపీ, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల్లో బయటపడ్డాయి. గతనెలలో యూపీలోని కాన్పూ ర్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన వస్తువు కారణంగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ 20 బోగీలు పట్టాలు తప్పాయి. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.