01-04-2025 02:13:09 AM
20 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం...
కార్వాన్,మార్చి 31 (విజయ క్రాంతి): వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని అతని వద్ద 20 గ్రాముల బంగారు చైన్ ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డిసిపి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కార్పెంటర్ అయిన సద్దాం షేక్ మొహమ్మద్ హుస్సేన్ (32) మల్లేపల్లి బడి మసీద్ రాయలసీ హోటల్ ప్రాంతానికి చెందినవాడు.
2010 నుంచి సద్దాం ఇతర ఆస్తి నేరాలతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 46 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. 2024 లో నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా బెయిలు పై విడుదలై ఇతర సహచరులతో కలిసి ఆర్టీసీ బస్సులలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
మార్చి 25 న సాయంత్రం మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో వెళుతున్న మహిళ మెడలో మంగళసూత్రం పుస్తెలతాడును దొంగిలించాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టివి పుటేజీ ఆధారంగా షేక్ సద్దాం హుస్సేన్ ను మల్లేపల్లి వద్ద పోలిసులు అదుపులోకి తీసుకొని,అతని వద్ద 20 గ్రాముల గొలుసును స్వాదీనం చేసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు.