24-03-2025 01:35:15 AM
అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి మ్యూజియం ఏర్పాటుతో పదిలం
గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం మార్చి 23 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామచంద్రస్వామి కొలువైయున్న భద్రాచలంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా డంపింగ్ యార్డ్ లోనే వేసి క్లీన్ భద్రాద్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మనుబోతులచెరువు వద్ద రూ 1.40 కోట్ల తో నిర్మించిన డంపింగ్ యార్డ్ ను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది సీతారామచంద్రస్వామి దర్శనానికి వస్తుంటారని అలాంటి దేవస్థానం ఉన్న భద్రాచలం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ప్రతిరోజు గ్రామపంచాయతీ అధికారులు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా వార్డుల్లో తిరిగి చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నది అధికారులు పరిశీలించాలన్నారు.
ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన చెత్త అత్యధికంగా పేరుకు పోయే అవకాశం ఉందని, తద్వారా దోమలు ప్రబలి భక్తులకు, ప్రజలకు అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు.చెత్త తో పాటు వార్డులలోని డ్రైనేజీల పోడికను తొలగి స్తూ ఉండాలని, డంపింగ్ యార్డుకు తరలించిన పొడి చెత్త ప్రతిరోజు రీసైక్లింగ్ చేయాలని గ్రామపంచాయతీ పరిధిలో తడి చెత్త ,పొడి చెత్త సేకరణ విషయంలో సిబ్బంది అరసత్వం వహించ వద్దన్నారు. శ్రీరామనవమి సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన మిగిలిన పనులు ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గిరిజన మ్యూజియం ద్వారా గిరిజనుల సంస్కృతికి పునర్జన్మ
ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఖండాంతరాలకు తెలిసే విధంగా గిరిజన మ్యూజియం ను పర్యాటకులు కనువిందు కలిగేలా ముస్తాబు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని మ్యూజియం ద్వారా పునరుద్ధరించినట్లు అయిందన్నారు. ఆదివారం ఐటిడిఏ ప్రాంగంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలో చిత్రీకరించిన గిరిజనులకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను, మ్యూజియం బయట ఉన్న పాతకాలపు ఇండ్లను, సెల్ఫీ పాయింటును, పాతకాలపు ఆభరణాలను తిలకించారు. చిన్నారులకు ఆటవిడుపుగా క్రీడా ప్రాంగణం యువకులకు బాక్స్ క్రికెట్ సరదాగా బోటింగ్ చేయడానికి చెరువును నిర్మించడం మ్యూజియం కి అందం చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.