- కుమ్రంభీం కలెక్టరేట్‌లో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి
- గతంలోనూ పలువురిపై అవినితీ ఆరోపణలు
- కొత్త వారిని నియమించినా మారని తీరు
- కీలక పదవిలో అనుభవం లేని అధికారి!
- ఫైల్ కదలాలంటే సారుకు మాట ఇవ్వాల్సిందే
- ఫిర్యాదు చేసేందుకు సాహసించని ఉద్యోగులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): కుమ్రంభీం కలెక్టరేట్‌లో కీలక అధికారి వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఇక్కడ విధు లు నిర్వహించిన వారిపై అరోపణలు రావడంతో వారిని తొలగించి కొత్తవారిని నియ మించారు.
ఇదివరకు ఆ స్థానంలో విధులు నిర్వహించిన వ్యక్తి కూడా జిల్లాస్థాయి అధికారుల కార్యకలాపాలు, సమీక్షలకు హాజర వడం, సలహాలు ఇవ్వడం, ఉద్యోగులపై అజమాయిషీ చేశాడన్న చర్చ అప్పట్లో జోరుగా వినిపించింది. ఈక్రమంలోనే బదిలీలు జరపగా అదే పరిస్థితి కొనసాగుతున్నదన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి.
అధికారిక విభాగం లో కీలక కొలువులను అనామకులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమం టున్నాయి. సదరు అధికారి వద్ద డిప్యూటీ స్థాయి ఉద్యోగి ఉండాల్సిన పోస్టులో కనీస అనుభవం లేని వ్యక్తులను నియమించుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సదరు వ్యక్తి వ్యవహారాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు సైతం సాహసం చేయలేకపోతున్నారని సమాచారం. ఈ విషయంపై ఉన్నతాధికారి దృష్టి సారించి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నేటికీ అందని ఎన్నికల బిల్లులు..
గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పని చేసిన వారికి పూర్తిస్థాయి బిల్లుల చెల్లించలేదు. ఈ విషయయాన్ని ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి పలువురు మొరపెట్టుకున్నారు.
మిగిలిన జిల్లాలో బిల్లులు మంజూరు కాగా ఇక్కడ ఇంకా పూర్తిస్థాయిలో బిల్లులు ఇవ్వలేదు. ఎన్నికల వేళ వచ్చిన బడ్జెట్‌కు ఆడిట్ లేకపోవడంతో ఆధికారులు ఇష్టానుసారం ఖర్చు చేసి.. బిల్లులు ఇవ్వడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
మాట ఇస్తేనే ఫైల్ ముందుకు..
ధరణి దరఖాస్తులతోపాటు ఇతర ఫైళ్లు ముందుకు కదలాలంటే కలెక్టరేట్‌లోని కీలక వ్యక్తి వద్ద విధులు నిర్వహి స్తున్న ఆ ఉద్యోగికి మాట ఇవ్వాల్సిందే. ఆయనను కాదని వెళితే ఆ ఫైల్‌ను అడ్డుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తి ఉద్యోగంలో చేరి ప్రొబిషన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనికి తోడు అధికారులపై అజ మాయిషీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.