calender_icon.png 23 December, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ బెంగాల్‌ను వేరుచేయండి

14-09-2024 03:17:03 AM

  1. మోదీ పాలన నుంచి విముక్తి కల్పించాలి
  2. సీఎం మమతకు బంగ్లా ఉగ్రవాది సూచన
  3. ఢిల్లీలో ఇస్లాం జెండా ఎగురవేస్తామని ప్రకటన

ఢాకా, సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత మత ఛాందసవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. హసీనా పతనం తర్వాత జైలు నుంచి విడుదలైన బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ జషీముద్దీన్ రహ్మానీ హఫీ భారత్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని మోదీ పాలన నుంచి బెంగాల్‌ను విడిపించి స్వాతంత్య్రం ప్రకటించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 30 నిమిషాల సుదీర్ఘ వీడియో సందేశంలో సూచించాడు.

అంతేకాకుండా భారత్ ను విచ్ఛిన్నం చేసి ఢిల్లీలో ఇస్లామిక్ జెండాలను ఎగురవేస్తామని హెచ్చరించాడు. రహ్మానీ వీడియో ఓ హాస్పిటల్‌లో సెప్టెంబర్ మొదటివారంలో చిత్రీకరి ంచినట్లు తెలుస్తోంది. ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)కి రహ్మానీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో నిషేధించిన ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్)కు ఏబీటీ మద్దతుగా నిలుస్తోంది. 

ఈశాన్యాన్ని వేరు చేయాలి

గతంలో ఓ బ్లాగర్ హత్య కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన రహ్మానీ.. మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో సైనిక మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే పెరోల్‌పై విడుదల అయ్యాడు. ఇస్లామిక్ ఉగ్రవాది రహ్మానీకి పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి. భారత్‌వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ బెంగాల్‌ను విడదీయాలని పిలుపునిచ్చాడు. సిలిగుడి కారిడార్ (చికెన్ నెక్)ను చైనా సాయంతో కట్ చేసి ఈశాన్య రాష్ట్రాలకు భారత్ నుంచి వేరు చేయాలని సూచించాడు.

అంతేకాకుండా బంగ్లాదేశ్‌పై ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడవద్దని భారత్‌ను హెచ్చరించాడు. సిక్కిం, భూటాన్ లాంటి చిన్న దేశం బంగ్లాదేశ్ కాదని గుర్తుంచుకోవాలన్నాడు. తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వ్యూహాత్మక ప్రతీకారానికి దారి తీస్తుందని హెచ్చరించాడు. హసీనాతో జతకూడి భారత్ ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దని అన్నాడు. 

భారత్‌కు ప్రమాదకారి

భారత్ భద్రతకు సంబంధించి రహ్మానీ ప్రమాదకారి. అతని విడుదల దేశం అప్రమత్తమైంది. ఆల్‌ఖైదాతో బలమైన సంబంధాల కారణంగా స్లీపర్ సెల్‌ల ద్వారా భారత్‌లో జీహాదీ నెట్‌వర్క్‌ను స్థాపించే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 మేలో ఏబీటీకి చెందిన ఉగ్రవాదులను అస్సాంలో పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా లష్కరే తోయిబాతో సైతం జతకూడిన ఏబీటీ భారత్‌లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి.