- ఆర్‌ఆర్ ప్యాకేజీకి వారు అర్హులు..
- పునరావాస, పునర్నిర్మాణం పథకాలూ అందించండి
- అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు
- భూనిర్వాసితుల కేసులో కీలక తీర్పు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఏదైనా ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపడుతున్న సమయంలో ఒక నిర్వాసిత పరిహారం ఇవ్వాల్సి వస్తే, ఆ కుటుంబంలో వితంతువును కూడా కుటుంబంలా గుర్తించి విడిగా పరిహారం ఇవ్వాల్సిందేనని శుక్రవారం హైకోర్టు తీర్పునిచ్చింది. వితంతు వుకు ఆర్‌ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం పథకాలను వర్తింప జేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
బాధితులు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి నాలుగు నెలల్లోగా ఆర్‌ఆర్ ప్యాకేజీ అందించాలని ఆదేశించింది. దీంతో సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘట్‌కు చెందిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వితంతువులకు పరిహార ఫలాలు అందనున్నాయి. 2016 19 మధ్యకాలంలో నాటి ప్రభుత్వం కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిమిత్తం వేములఘట్ గ్రామ పరిసరాల్లో సుమారు 2,500 ఎకరాల భూమి సేకరించింది.
ప్రాజెక్ట్ కారణంగా తమ గ్రామం ముంపునకు గురవుతున్నప్పటికీ అధికారులు తమకు పునరావాసం, పునర్నిర్మాణ పథకం వర్తింపజేయాలేదని, పరిహారం ఇవ్వలేదని నిర్వాసితురాలు చీర్ల గంగవ్వ సహా 36 మంది నిర్వాసిత మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై పిటిషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లందరి వయస్సు 65 ఏండ్లు దాటిందని, భర్తలు చనిపోవడంతో వారు పిల్లలు లేదా బంధువుల ఇంట ఆశ్రయం పొందుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు చట్టప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపట్టలేదని, కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదన్నారు.
వీటిపై కొందరు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు. పిటిషనర్లు గత డిసెంబర్‌లో పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వితంతువులకు విడిగా పరిహారం అందించాలని కోరారు.
అనంతరం రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. పునరావాస పునర్నిర్మాణం కింద పరిహారం చెల్లించాలని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు సిద్దిపేట కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, అభ్యర్థనలను కలెక్టర్ పరిగణలోకి తీసుకుంటారని ఏజీ హామీ ఇచ్చారు.
ఈ హామీని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. పిటిషనర్లు తమ అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాలను అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు నెలల్లోపు పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.