16-02-2025 12:00:00 AM
న్యాయస్థానాల ముందుకు వచ్చే కొన్నికేసులు చాలా తమా షాగా ఉంటాయి. ఆ కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా అంతే ఫన్నీ ఉంటాయి. వినే వాళ్లకు ఇది సరదాగా అనిపించవచ్చు కానీ కోర్టు మెట్లెక్కిన కక్షిదారులకు బాధగానే ఉంటుంది. సాధారణంగా ఇలాం టి తీర్పులు ఎక్కువగా భార్యాభర్తల విడాకులు, మనోవర్తికి సంబంధించిన కేసుల్లోనే ఉంటున్నాయి.
ఇటీవలి కాలంలో భార్యాభర్తలు చిన్న చిన్నకారణాలకే విడిపోవాలనుకోవడం, భార్య తన మాజీ భర్తనుంచి పెద్దమొత్తం లో భరణం డిమాండ్ చేయడం జరుగుతోంది. తన దగ్గర డబ్బులు లేవన్న కారణంగా తన మాజీ భార్య, నలుగురు పిల్లలకు భరణం చెల్లించలేనంటూ ఓ వ్యక్తి ఇటీవల కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
అయితే సంపాదించే శక్తి ఉండడమే కాకుండా ఎలాంటి శారీరక వైకల్యం లేని వ్యక్తి తనకు ఆదాయం లేదన్న సాకుతో తన మాజీ భార్య, పిల్లలలకు మనోవర్తి చెల్లించలేనని చెప్పడం సరికాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ బీ స్నేహలతలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. విడాకులు అనేది భర్తకన్నా భార్యకే ఎక్కువ బాధ కలిగించే విషయమని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కింది కోర్టు నిర్ణయించిన మొత్తాన్ని వారికి భరణంగా చెల్లించి తీరాలని స్పష్టం చేసింది. దీనికి పూర్తి భిన్నమైన తీర్పును ఒడిశా హైకోర్టు ఇటీవల వెలువరించింది. భార్యాభర్తలిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. అయితే భరణం విషయంలోనే తగాదా వచ్చిం ది. తన భార్య బాగా చదువుకొందని, ప్రయత్నిస్తే ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందని,
అయితే భరణం కోసం ఇంట్లో ఖాళీగా ఉంటోదంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. చివరికి కోర్టు మాజీ భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. విద్యావంతురాలయిన భార్య భరణం కోసం ఇంట్లో ఖాళీ కూర్చోవడం సరికాదంటూ అది దాని మూల ఉద్దేశాన్నే దెబ్బతీస్తుదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
మంచి ఉద్యోగాలు చేస్తూ విడాకులు తీసుకునే నేటితరం దంపతులకు ఈ తీర్పు ఓ కనువిప్పు కావాలి. హర్యానాలో ఆ మధ్య ఓ పెద్దాయన తన భార్యతో కాపురం చేయ డం ఇష్టం లేక ఆమెకు చెల్లించాల్సిన భరణం కోసం తన ఆస్తులనే ఆమ్మేశాడనే వార్త సంచలనం సృష్టించింది. ఇది ఇప్పటి కేసు కాదు. దశాబ్దాల నాటిది.
తన భార్యతో ససేమిరా కాపురం చేయనంటూ ఆ పెద్దాయన గతంలో కోర్టు మెట్లెక్కాడు. అయితే సంపన్న రైతు కావడంతో కోర్టు మాజీ భార్యకు పెద్ద మొత్తంలో భరణం ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. అంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ఆయన జిల్లా కోర్టు, హైకోర్టు చివరికి సుప్రీంకోర్టు మెట్లు కూడాఎక్కాడు. ఎక్కడా ఆయనకు ఊరట లభించలేదు.
ప్రస్తుత ధరల ప్రకారం మాజీ భార్యకు కోట్ల రూపాయల భరణం ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అప్పటికే కొడుకులకు ఆస్తి పంపకాలు కూడా చేసిన ఆయన భరణం చెల్లించడానికి తన వాటా కింద వచ్చిన మొత్తం ఆస్తిని అమ్మేసి కోట్ల రూపాయల భరణం చెల్లించి వదిలించేసుకున్నాడు.
పంతాలకు పోతే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ తీర్పులు చెప్తున్నాయి. భార్యాభర్తలయినా, ఇతరులైనా సరే ఇలాంటి వివాదాలను కోర్టులదాకావెళ్లకుండా మధ్యవర్తుల వద్దనో, ఫ్యామిలీ కోర్టుల స్థాయిలోనో పరిష్కరిం చుకుంటే ఇరుపక్షాలకు గౌరవంగా ఉంటుంది. అయితే ఆ విషయాన్ని చాలామంది మరిచిపోతున్నారు.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధం కలకాలం నిలవాలంటే కొంచెం సర్దుబాటు ధోరణి, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో అవే కరువయిపోవడంతోనే కోర్టుల్లో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. విడాకులు మగవాడికన్నా, ఆడవాళ్లకే ఎక్కువ బాధాకరమన్న వాస్తవాన్ని గ్రహిస్తే సగం కేసులు ప్రాథమిక దశలోనే పరిష్కామవుతాయి.
దానికి ఇరుపక్షాల తల్లిదండులు, సన్నిహిత బంధువుల సహకారం ఎంతయినా అవసరం. అయితే సింగిల్ ఫ్యామిలీలు ఎక్కువైన నేపథ్యంలో వాళ్లకు చెప్పేదెవరు? వారి మాట వినేదెవరు?