ఆగ్రా, ఆగస్టు 1: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా షాగంజ్ ప్రాంతంలోని ఓ పంచాయతీ పెద్దలు అత్యాచార ఘటనలో అశాస్త్రీయ తీర్పు వెలువరించారు. నిందితుడికి చెప్పు దెబ్బలతో పాటు రూ.15 వేలు జరిమానా విధించారు. జూలై 25వ తేదీన షాగంజ్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో స్థానిక యువకుడు ఆమెను అపహరించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులు విచారణ నిమిత్తం గ్రామానికి చేరుకున్నారు.
అయితే పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకొని యువతిని తాము కనుగొంటామని పేర్కొన్నారు. 5 గంటల తర్వాత ఆమెను తిరిగి తీసుకొచ్చారు. విషయం బయటకు పొక్కితే యువతి కుటుంబ సభ్యుల పరువు పోతుందని, తర్వాత ఏం చేయాలనేది తాము చూసుకుంటామని పోలీసులకు తెలిపారు. అయితే, సదరు యువతి ఓ వ్యక్తి తనను లాక్కెళ్లి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు చెప్పడంతో గ్రామంలో పంచాయితీ పెట్టారు. దీంతో నిందితుడి తలపై 5 చెప్పు దెబ్బలు కొట్టడంతో పాటు బాధితురాలికి రూ.15,000 చెల్లించాలని తీర్పు వెల్లడించారు.