కొత్త రికార్డుస్థాయిల్లో ముగిసిన సూచీలు
న్యూఢిల్లీ, జూన్ 20: విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో హెవీవెయిట్ షేర్లు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో స్టాక్ సూచీలు మరో కొత్త రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ వరుసగా ఆరో రోజూ లాభపడింది. సెన్సెక్స్ గురువారం ఇంట్రాడేలో 305 పాయింట్లు ఎగిసి 77,643 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరి, చివరకు 141 పాయింట్ల లాభంతో 77,479 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 108 పాయింట్లు ర్యాలీ జరిపి 23,624 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం చివరకు 51 పాయింట్ల లాభంతో 23,567 పాయింట్ల వద్ద నిలిచింది.
రెండు సూచీలు ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. గ్లోబల్ మార్కెట్లు కూడా రికార్డుస్థాయిల్లో ఉన్నందున, ఇన్వెస్టర్ల విశ్వాసం మెరుగ్గా ఉన్నదని, స్విస్ నేషనల్ బ్యాంక్ వరుసగా రెండో దఫా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును తగ్గించడంతో యూరప్ షేర్లు పటిష్ఠపడ్డాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. షాంఘై, హాంకాంగ్ ఇండెక్స్‌లు తగ్గాయి. యూరప్ సూచీలు లాభాలతో ముగిసాయి.
బడ్జెట్‌పైనే ఫోకస్
విదేశీ ఇన్వెస్టర్లు గత మూడు రోజుల్లో రూ.12,600 కోట్ల నిధుల్ని మార్కెటోకి తీసుకురావడంతో మార్కెట్ పాజిటివ్ ధోరణిలో కన్సాలిడేట్ అవుతున్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు. రానున్న బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు మద్దతు ఇస్తున్నాయని, ఆయా రంగాలవారీగా కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు తిరిగి తరలివస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. సమీప భవిష్యత్తులో మార్కెట్ దృష్ఠి వచ్చే కేంద్ర బడ్జెట్‌పై కేంద్రీకృతమై ఉంటుందని చెప్పారు.
4 రోజుల్లో రూ.13,000 కోట్లు
జూన్ తొలి రెండు వారాల్లో వరుస అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. గత మూడు రోజుల్లో రూ.12,600 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు గురువారం మరో రూ.415 కోట్ల నిధుల్ని మార్కెట్లో పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొత్తం ఈ నాలుగు రోజుల్లో ఈ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు రూ.13,000 కోట్లకు చేరాయి.
మెటల్, బ్యాంకింగ్ జోరు
సెన్సెక్స్ బాస్కెట్‌లో బ్యాంకింగ్, మెటల్ షేర్లు జోరుగా పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్‌గ్రిడ్‌లు తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో రియల్టీ ఇండెక్స్ అధికంగా 1.97 శాతం ఎగిసింది. కమోడిటీస్ సూచి 1.88 శాతం, మెటల్స్ ఇండెక్స్ 1.87 శాతం, ఎనర్జీ 0.90 శాతం, ఇండస్ట్రియల్స్ 0.50 శాతం చొప్పున పెరిగాయి. టెలికమ్యూనికేషన్స్, యుటిలిటీస్, ఆటోమొబైల్, పవర్, టెక్నాలజీ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, స్మాల్‌క్యాప్ సూచి 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,282 షేర్లు పెరగ్గా, 1,571 షేర్లు తగ్గాయి.