calender_icon.png 28 September, 2024 | 4:46 AM

84,000 శిఖరంపైకి సెన్సెక్స్

21-09-2024 12:00:00 AM

  1. 1,360 పాయింట్ల లాంగ్ జంప్
  2. 25,800పైన నిఫ్టీ కొత్త రికార్డు
  3. ప్రపంచ ర్యాలీలో పాలుపంచుకున్న భారత్

ముంబై, సెప్టెంబర్ 20: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ అంచనాల్ని మించి వడ్డీ రేటును అరశాతం తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈక్విటీ ర్యాలీకి అనుగుణంగా భారత్ సూచీలు కదం తొక్కాయి. బుల్స్ దూకుడు ప్రదర్శించడంతో వారం రోజుల వ్యవధిలోనే భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచి బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో కొత్త శిఖరాన్ని అధిరోహించింది. శుక్రవారం జరిగిన భారీ ర్యాలీతో ఒక్క ఉదుటన 1,300 పాయింట్లకుపైగా పెరిగి చరిత్రలో తొలిసారిగా 84,000 శిఖరాన్ని అందుకున్నది.

గత గురువారమే ఈ సూచీ ప్రప్రధమంగా 83,000 స్థాయిని దాటింది. సరిగ్గా ఆరవ ట్రేడింగ్ సెషన్లో 84,000 ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నది. తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  సైతం మొదటిసారిగా 25,800 పాయింట్ల పైకి చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,5,09 పాయింట్లు పెరిగి 84,694 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకి కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 1,359 పాయింట్ల లాభంతో 84.544 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డుస్థాయి వద్ద ముగిసింది.  ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 433 పాయింట్లు పెరిగి  25,849 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది.  చివరకు 375  పాయింట్లు లాభంతో 25,790 పాయింట్ల వద్ద ముగిసి చరిత్ర సృష్టించింది.  ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

ఫెడ్ రేట్ల కోత ప్రభావం

యూఎస్ ఫెడ్ భారీగా వడ్డీ రేట్లను తగ్గించి, ద్రవ్య విధానాన్ని సరళతరం చేయడంతో ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో భారత్ సైతం పాలుపంచుకున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఫెడ్ పాలసీతో స్వల్ప, మధ్యకాలాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందన్నారు. గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడిందన్నారు. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేట్ల కోత ప్రపంచ మార్కెట్లను ఆశ్చర్యపర్చిందని, ఈక్విటీలు పరుగు తీస్తున్నాయని క్యాపిటల్‌మైండ్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ కృష్ణ అప్పల వివరించారు.

ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, షాంఘై, హాంకాంగ్‌లు భారీగా లాభపడ్డాయి. గురువారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు ఎస్ అండ్ పీ 500, డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్‌లు కొత్త రికార్డుస్థాయి వద్ద నిలిచాయి. జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ఫెడ్ రేట్లను అరశాతం తగ్గించకపోవచ్చని, పావు శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేశారు. 

ఎం అండ్ ఎం టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 5 శాతంపైగా పెరిగి రూ.2,950 వద్ద ముగిసింది.  జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్ టెల్,  నెస్లే, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి, కోటక్ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, టాటా స్టీల్‌లు 4 శాతంవరకూ లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్‌లు స్వల్ప నష్టంతో ముగిసాయి. తాజా ర్యాలీ సందర్భంగా పలు బ్లూచిప్ షేర్లు నూతన గరిష్ఠస్థాయిని నమోదు చేశాయి. భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కొత్త రికార్డు స్థాయిని నెలకొల్పడంతో పాటు అదేస్థాయి వద్ద ముగిసాయి.

అన్ని రంగాల సూచీలూ పాజిటివ్‌గానే ముగిసాయి. అధికంగా రియల్టీ, ఆటో, మెటల్ సూచీలు లాభపడ్డాయి. రియల్టీ ఇండెక్స్ 3.21 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.32 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 2.2 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.08 శాతం, మెటల్ ఇండెక్స్ 1.82 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.78 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.55 శాతం, బ్యాంకెక్స్ 1.44 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.10 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.37 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.16  శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,442 షేర్లు లాభపడగా, 1,502 షేర్లు తగ్గాయి.250షేర్లు వాటి 52 వారాల గరిష్ఠస్థాయిని తాకాయి.

రూ.6.24 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

తాజా మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద శుక్రవారం ఒక్కరోజు లోనే రూ.6.24 లక్షల కోట్లు పెరిగి కొత్త రికార్డుస్థాయికి ఎగిసింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,24,468 కోట్లు పెరిగి రూ.4,71,71,745 కోట్లకు (5.65 ట్రిలియన్ డాలర్లు) చేరింది.