calender_icon.png 29 October, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

78,000 శిఖరంపైకి సెన్సెక్స్

26-06-2024 12:16:40 AM

  • కొత్త రికార్డుల్ని సృష్టించిన సూచీలు
  • ప్రైవేటు బ్యాంకింగ్ షేర్ల భారీ ర్యాలీ

న్యూఢిల్లీ, జూన్ 22: రెండు రోజుల విరామం తర్వాత మార్కెట్లో తిరిగి రికార్డులు హోరెత్తిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మంగళవారం తొలిసారిగా 78,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23,700 పాయింట్ల స్థాయిని దాటేసింది.  ప్రై వేటు బ్యాంకింగ్ షేర్లకు లభించిన భారీ కొనుగోలు మద్దతుతో సెన్సెక్స్ 712 పాయింట్లు ఎగిసి 78,054 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 824 పాయింట్లు ర్యాలీ జరిపి 78,164 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్ఠస్థాయిని తాకింది. జూన్ 10న తొలిసారిగా 77,000 పాయింట్ల మార్క్‌ను టచ్ చేసిన సెన్సెక్స్ రెండు వారాల్లోనే మరో మైలురాయిని చేరుకోవడం గమనార్హం.  తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి కొత్త రికార్డుస్థాయి 23,721 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంటాడ్రేలో ఇది జీవితకాల గరిష్ఠం 23,754 స్థాయిని తాకింది. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు 

వరుసగా శుక్ర, సోమవారాల్లో నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట ర్లు మంగళవారం తిరిగి మార్కెట్లో నిధులు కుమ్మరించారు. తాజాగా  రూ.1,175 కోట్లు నికర పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారంలో శుక్రవారం మినహా మిగిలిన నాలు గు రోజుల్లోనూ భారీగా 13,000 కోట్లు ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. కానీ గత రెండు రోజు ల్లో రూ.2,300 కోట్లు వెనక్కు తీసుకున్నారు. 

యాక్సిస్ బ్యాంక్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా యాక్సిస్ బ్యాంక్ 3.6 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.1,278 వద్ద ముగిసింది. ఇదేరీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ 2.48 శాతం పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ.1,198 వద్ద నిలిచింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, లార్సన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 2.2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే, మారుతి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1.2 శాతం వరకూ నష్టపోయాయి.

వివిధ రంగాల సూచీల్లో బ్యాంకెక్స్ అధికంగా 1.87 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్ 1.45 శాతం, ఐటీ ఇండెక్స్ 0.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచి 0.28 శాతం చొప్పున లాభపడ్డాయి.  రియల్టీ ఇండెక్స్ అధికంగా 1.82 శాతం క్షీణించగా, పవర్ ఇండెక్స్ 1.05 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.95 శాతం, మెటల్ సూచి 0.84 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.28 శాతం చొప్పున నష్టపోయాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ సూచి 0.03 శాతం తగ్గింది.