calender_icon.png 12 October, 2024 | 10:02 AM

స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్

24-08-2024 12:30:00 AM

ముంబై, ఆగస్టు 23: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లపై సంకేతాలు వెలువరించనున్న నేపథ్యంలో శుక్రవారం గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.    బీఎస్‌ఈ సెన్సెక్స్  33 పాయింట్లు లాభంతో 81,086 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ సూచీ పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. 

ఇదేబాటలో వరుసగా ఏడో రోజూ అప్‌ట్రెండ్ సాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి  24,813 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడ్ పొవెల్ ప్రసంగం ఉన్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చు తగ్గులకు లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్  వినోద్ నాయర్ తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గించే సమ యం, తగ్గింపు వేగంపై సంకేతాల కోసం మార్కెట్ వేచిఉందని స్టాక్స్‌బాక్స్ డెరివేటివ్ అనలిస్ట్ అవధూత్ బాగ్‌కర్ చెప్పారు. 

టాటా మోటార్స్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్ 1.53  శాతం పెరిగి రూ.1,086 వద్ద ముగిసింది. సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1 శాతం వరకూ తగ్గాయి.

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.07 శాతం పెరిగింది. ఆటోమొబైల్ ఇండెక్స్ 0.93 శాతం,  ఇండస్ట్రియల్స్ సూచి 0.26 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.23 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.13శాతం చొప్పున పెరిగాయి.రియల్టీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.15 లాభపడింది.