calender_icon.png 25 October, 2024 | 5:47 AM

శిఖరంపై సెన్సెక్స్

04-07-2024 01:49:18 AM

ముంబై, జూలై 3: స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈ సూచీ 79,000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు చేరడానికి వారం కూడా సమయం పట్టలేదు. జూన్ 25న తొలిసారిగా 78,000 పాయింట్ల స్థాయిని దాటిన సెన్సెక్స్, అటుతర్వాత రెండు రోజుల్లోనే 79,000 పాయింట్లపై పాగా వేసింది. తిరిగి ఈ  బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 80,000 పాయింట్ల స్థాయిని దాటేసి 80,074 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రప్రధమంగా 24,300 పాయింట్ల స్థాయిని అధిగమించి 24,309 పాయింట్ల వద్ద నూతన గరిష్ఠస్థాయిని నమోదు చేసింది.

చివరకు సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 79,987 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ 163 పాయింట్లు జంప్‌చేసి 24,286 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌లో 40 షేర్లు గ్రీన్‌లో ముగియడం గమనార్హం. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలంగా ఉండటంతో భారత మార్కెట్ కొత్త గరిష్ఠాలను చేరుతున్నదని, బ్యాంకింగ్ స్టాక్స్‌లో జరిగిన కొనుగోళ్లతో సెన్సెక్స్ 80,000 పాయింట్లను, నిఫ్టీ 24,300 పాయింట్లను అవలీలగా అధిగమించాయని మోతీలాల్ ఓస్వాల్  రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్ నికాయ్ ఇండెక్స్ 1.25 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 1.16 శాతం చొప్పున పెరిగాయి. యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. 

రూ.3 లక్షల కోట్లు పెరిగిన సంపద

తాజా మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సం పద రూ. 3 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కె ట్ విలువ రూ.445.53 లక్షల కోట్ల  (5.33 ట్రిలియన్ డాలర్లు) రికార్డుస్థాయికి చేరింది. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,355 లాభపడగా, 1,566 నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, జొమాటోలు 52 వారాల గరిష్ఠస్థాయిల్ని నమోదు చేశాయి. 

టాటా కన్జూమర్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ 3.55% లాభపడింది. అదానీ పోర్ట్స్ 2.4% , కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.23 %  చొప్పున పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలీవర్ షేర్లు 1 %  మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ 1.20 %  వరకూ నష్టపోయాయి. 

బ్యాంక్ నిఫ్టీ దూకుడు

ఎన్‌ఎస్‌ఈలో అధిక ట్రేడింగ్ పరిమాణం నమోదుచేసే బ్యాంక్ నిఫ్టీ 53,256 పాయింట్లకు చేరి కొత్త రికార్డును సృష్టించింది. ఇదేరీతిలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం వాటి జీవితకాల గరిష్ఠస్థాయికి చేరాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్, మెటల్ ఇండెక్స్, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ఇండెక్స్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 0.8 శాతం నుంచి 1.6 శాతం మధ్య పెరిగాయి. 

మరో మైలురాయిని చేరిన మార్కెట్

స్టాక్ మార్కెట్ మరో మైలురాయిని చేరుకున్నదని, స్థూల ఆర్థిక స్థిరత్వ, భవిష్యత్ వృద్ధి అంచనాలు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయని మిరే అసెట్ ఇన్వెస్టర్స్ మేనేజర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ నీలేశ్ సురానా చెప్పారు. భారత్ బ్యాంక్‌ల ఎన్‌పీఏలు 12 ఏండ్ల కనిష్ఠానికి తగ్గినందున సమీప భవిష్యత్తులో ఈ రంగం షేర్లు ఆధిపత్యం చెలాయిస్తాయని అంచనా వేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

మరింత ముందుకు విశ్లేషకుల అంచనా

బుధవారం మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమై సెన్సెక్స్ 79,600 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 24,200 పాయింట్ల నిరోధస్థాయిని సులభంగా అధిగమించడం సాంకేతికంగా సానుకూలాంశమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. ఇంట్రాడేలో హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మేషన్‌ను నిలబెట్టుకున్నందున, సమీప భవిష్యత్‌లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చౌహాన్ అంచనా వేశారు. ఇండెక్స్‌లు 79,600/24,200పైన స్థిరపడితే 80,200/24,400 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చని, ఆ స్థాయిల్ని సైతం అధిగమిస్తే 80,500/24,500 స్థాయిల్ని అందుకోవచ్చని విశ్లేషించారు. అయితే 79,600/24,200 స్థాయిల దిగువన ట్రెండ్‌లో మార్పు వస్తుందని అంచనా వేశారు.