ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు
ముంబై, నవంబర్ 28: రెండు రోజులపాటు దాదాపు స్థిరంగా నిలిచిన స్టాక్ మార్కెట్ గురువారం హఠాత్ పతనాన్ని చవిచూసింది. ట్రంప్ టారీఫ్‌ల భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోతల పట్ల అనుమానాల కారణంగా అంతర్జాతీయ సంకేతాలు బలహీనపడ్డాయి. ఫలితంగా మార్కెట్ నిలువునా పడిపోయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,315 పాయింట్లు వరకూ పతనమై 78,918 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 1,190 పాయింట్లు భారీ నష్టంతో 79,043 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 400 పాయింట్ల మేర పడిపోయి 23,876 పాయింట్ల కనిష్ఠస్థాయిని చూసింది. తుదకు 360 పాయింట్ల నష్టంతో 23,914 పాయింట్ల వద్ద ముగిసింది.
హెవీవెయిట్ షేర్లయిన ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల్లో జరిగిన అమ్మకాలు స్టాక్ సూచీలను తీవ్ర నష్టాలకు లోను చేశాయని, ఐటీ, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని ట్రేడర్లు తెలిపారు. తాజా క్షీణతతో ఇన్వెస్టర్ల సంపద రూ.1,50,265 కోట్లు తగ్గి రూ.4,42,98,083 కోట్ల వద్ద నిలిచింది.
ఫెడ్ రేట్ల కోతపై అనుమానాలు
అక్టోబర్ నెలలో యూఎస్ పీసీఈ ద్రవ్యోల్బణం 2.8 శాతానికి పెరిగినట్లు తాజా గణాంకాలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ వచ్చే డిసెంబర్ సమీక్షలో వడ్డీ రేట్ల కోతపై మార్కెట్లో తిరిగి సందేహాలు తలెత్తాయని, మరోవైపు ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజుకావడంతో పెద్ద ఎత్తున లాంగ్ పొజిషన్లు ఆఫ్‌లోడ్ కావడం హెవీవెయిట్ షేర్లను దెబ్బతీసాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు.
ఎం అండ్ ఎం, ఇన్ఫీలు టాప్ లూజర్లు
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లు 3.45 శాతం తగ్గాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్‌లు 2.8 శాతం వరకూ క్షీణించాయి.సెన్సెక్స్ ప్యాక్‌లో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు మాత్రమే గ్రీన్‌లో ముగిసింది.
వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా ఐటీ ఇండెక్స్ 2.35 శాతం తగ్గగా, టెక్నాలజీ ఇండెక్స్ 2.12 శాతం క్షీణించింది. ఆటోమొబైల్ ఇండెక్స్ 1.39 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.20 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.70 శాతం చొప్పున తగ్గాయి. బ్యాంకెక్స్ 0.81 శాతం క్షీణించింది. బీఎస్‌ఈ యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.41 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం తగ్గింది.
తిరిగి ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
ఒకే రోజులో రూ.11,756 కోట్లు వెనక్కు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజులపాటు స్వల్పంగా నికర కొనుగోళ్లు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం తిరిగి భారీ విక్రయాలకు తెగపడ్డారు. ఈ ఒక్కరోజులోనే రూ.11,756 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్‌పీఐలు నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ నెల ప్రారంభం నుంచి పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయించిన ఎఫ్‌పీఐలు ఈ మంగళ, బుధవారాల్లో మాత్రం స్వల్పంగా రూ.17 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
రెండో రోజూ పెరిగిన ఐదు అదానీ కంపెనీలు
యూఎస్‌లో క్రిమినల్, సివిల్ కేసుల్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లోని ఐదు కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజూ పెరిగాయి. గ్రూప్‌నకు చెందిన 11 లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీలు 10 శాతం చొప్పున పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.63 శాతం పెరగ్గా, అదానీ పోర్ట్స్ 2.73 శాతం తగ్గింది.