- ఫ్లాట్‌గా ముగింపు
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ, జూలై 2: గత శుక్రవారం విరామం తర్వాత సోమవారం కొత్త రికార్డులు నెలకొల్పిన స్టాక్ సూచీలు మంగళ వారం సైతం ట్రేడింగ్ ప్రారంభంలో అదే జోరును కనపర్చాయి. అయితే మధ్యాహ్న సెషన్ తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో చివరకు ఫ్లాట్‌గా ముగిసాయి. ఐటీ షేర్ల ర్యాలీతో ట్రేడింగ్ ప్రారంభ సమయంలో జోరును కొనసాగించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలుత 380 పాయింట్లు పెరిగి 79,856 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని తాకింది.
మధ్యాహ్న సెషన్ తర్వాత బ్యాం కింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాలు ప్రారంభంకావడంతో సెన్సెక్స్ గరిష్ఠస్థాయి నుంచి వెనక్కు తగ్గింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 35 పాయింట్ల తగ్గుదలతో 79,441 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఇంట్రాడేలో 94 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 24,236 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 18 పాయింట్ల నష్టంతో 24,123 పాయింట్ల వద్ద క్లోజయ్యింది
ఎల్ అండ్ టీ టాపర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టుబ్రో 2.73 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్‌లు 1 శాతం మధ్య పెరిగాయి. అదానీ వివాదంలో చిక్కుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నింటికంటే అధికంగా 2.5 శాతం నష్టపోయింది. భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్‌లు 1 శాతం మధ్య తగ్గాయి.