calender_icon.png 14 March, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ లాభాల్లో సూచీలు

07-03-2025 12:00:00 AM

22,500 ఎగువకు నిఫ్టీ

ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఉదయం కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత స్థిరంగా లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు ఇంధన, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా వరకు స్టాక్స్ ధరలు దిగొచ్చిన వేళ మదుపర్లు కొనుగోళ్లకు దిగడం ప్రధాన కారణం. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ సైతం 22,500 మార్కు దాటింది. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు సైతం రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 74,308.30 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకుంది.

73,415.68 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. మళ్లీ అంతే వేగంగా పుంజుకొంది. ఇంట్రాడేలో 74,390.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 609.86 పాయింట్ల లాభంతో 74,340.09 వద్ద ముగిసింది. నిఫ్టీ 207.40 పాయింట్ల లాభంతో 22,544.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 6 పైసలు మేర బలహీనపడి 87.12 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69.51 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2901 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.