calender_icon.png 17 October, 2024 | 8:55 PM

సెన్సెక్స్ దూకుడు

27-09-2024 12:00:00 AM

666 పాయింట్లు అప్

26,200 దాటిన నిఫ్టీ

సరికొత్త రికార్డుల సృష్టి

ముంబై, సెప్టెంబర్ 26: ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం లాంగ్ జంప్ చేసింది. మార్కెట్లో సరికొత్త రికార్డులు నెలకొన్నాయి.  సెన్సెక్స్ ఒక్కసారిగా 666 పాయింట్లు పెరిగి 85, 836 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఈ సూచి 85,930 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. ఇదేబాటలో  ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 26,250 పాయిం ట్ల వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసిన అనంతరం 212 పాయింట్ల లాభంతో 26,216 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ రెండు సూచీలు ఈ స్థాయిల వద్ద ముగియడం ఇదే ప్రధమం.  సెప్టెంబర్ డెరివే టివ్ కాంట్రాక్టులకు ముగింపు రోజైనందున ట్రేడింగ్ తొలిదశలో కాస్త ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, ముగింపు సమ యంలో జోరుగా ర్యాలీ సాగింది. తాజా ర్యాలీలో ఆటోమొబైల్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లన్నీ గొప్ప ర్యాలీ జరిపాయి. సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు 5 శాతం వరకూ పెరిగాయి. 

చైనా ఆర్థిక ఉద్దీపన ప్రభావం

చైనా ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించిందని, ఈ కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ప్రత్యేకించి ఆసియాలో గణనీయమైన పాజిటివ్ మూమెంటం  కొనసాగుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దీనికితోడు యూఎస్ సుంచి స్థిరమైన ఆర్థిక గణాంకాలు వెలువడుతున్నందున మార్కెట్లో ఆశావహ దృక్పథం నెలకొన్నదని తెలిపారు. భారత్‌కు సంబంధించి రానున్న నెలల్లో ప్రభుత్వ వ్యయాలు పెరగనున్నందున ఈ ద్వితీయార్థంలో కార్పొరేట్ లాభాలు బాగుంటాయన్న అంచనాలు ఉన్నాయన్నారు. 

టాప్‌గేర్‌లో మారుతి

సెన్సెక్‌ేొ్స30 బాస్కెట్‌లో 28 షేర్లు లాభపడగా, రెండు మాత్రమే తగ్గాయి. లాభపడిన షేర్లలో  అన్నింటికంటే అధికంగా మారుతి సుజుకి  4.7 శాతం పెరిగి రూ.13,380 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లేలు 3 శాతం వరకూ పెరిగాయి. లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీలు స్వల్పంగా నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆటోమొబైల్ ఇండెక్స్ 2.23 శాతం పెరిగింది.

మెటల్ ఇండెక్స్ 2.08 శాతం ఎగిసింది. కమోడిటీస్ సూచి 1.32 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.84 శాతం,  కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.75 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.64 శాతం చొప్పున లాభపడ్డాయి. టెలికమ్యూనికేషన్స్, యుటిలిటీస్ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.39 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం చొప్పున తగ్గాయి. 257 షేర్లు వాటి 52 వారాల గరిష్ఠస్థాయిల్ని నమోదు చేశాయి.