calender_icon.png 21 March, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

20-03-2025 11:32:25 PM

వక్షోజాలు తాకడం, పైజామా తాడు లాగడం రేప్ కిందకు రాదు..

తీవ్రమైన లైంగిక వేధింపులు మాత్రమే..

అత్యాచారంగా పరిగణించలేం..

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు..

అలహాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలిక వక్షోజాలను తాకడం, పైజామా తాడును తొలగించడం అత్యాచారం కిందకు రాదని పేర్కొంది. గురువారం అలహాబాద్ హైకోర్టులో పదకొండేళ్ల బాలిక లైంగిక దాడి కేసుకు సంబంధించి న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రామ్ మనోహర్ మాట్లాడుతూ.. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని.. కేవలం తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడడం మాత్రమేనని స్పష్టం చేశారు.

విషయంలోకి వెళితే.. 2021లో ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో పవన్, ఆకాశ్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ 11 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. బాధితురాలి వక్షోజాలను అసభ్యంగా తాకడం, ఆమె పైజామా తాడును తెంచేసి పక్కనే ఉన్న కల్వర్టులోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఈ సమయంలో అటుగా వెళ్లేవారు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

తీవ్రమైన లైంగిక వేధింపులు మాత్రమే..

కాస్‌గంజ్ ట్రయల్ కోర్టు ఆదేశాలతో పవన్, ఆకాశ్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కింద సమన్లు జారీ చేశారు. ట్రయల్ కోర్టు ఆదేశాలను నిందితులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా విచారించిన న్యాయమూర్తి రామ్ మనోహర్ సమన్లలో సెక్షన్లను సవరిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం, పైజామా తాడును లాగడం అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొన్నారు. నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని స్పష్టం చేశారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354 (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.