calender_icon.png 22 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్లలో కారం కొట్టి.. కుర్చీకి కట్టేసి

22-04-2025 12:25:21 AM

  1.  కత్తులతో పొడిచి దారుణ హత్య
  2.  కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో సంచలన విషయాలు
  3.  పోలీసులు అదుపులో భార్య, కూతురు

బెంగళూరు: కర్ణాటకలో అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురైన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆస్తి తగాదాలు కారణంగా భార్య పల్లవి చేతిలో హతమైనట్టు పోలీసులు ధ్రువీకరించారు.

ఆస్తి విషయమై భార్య పల్లవి భర్తతో గొడవపడింది. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఓం ప్రకాశ్ కళ్లలో కారంపొడి కొట్టి, ఆపై కుర్చీకి కట్టేసి కత్తితో పొడిచి చంపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తన తండ్రి హత్య వెనుక తల్లి పల్లవి, సోదరి కృతి ప్రమేయం ఉండవచ్చని కార్తికేశ్ తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరూ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, తరచూ తన తండ్రితో గొడవపడేవారని పోలీసులకు తెలిపారు.

గతవారం తన తల్లి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ, ఓం ప్రకాశ్ తన సోదరి సరితా కుమారి ఇంట్లో ఉన్నారని, అయితే శుక్రవారం కృతి వెళ్లి ఆయన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చిందని కార్తికేశ్ వివరించారు. ఆదివారం సాయంత్రం పల్లవిని, సోమవారం ఉదయం కుమార్తె కృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది.