- కులగణన సమావేశానికి.. పార్టీ బీసీలు అర్హులుకారా..?
- బీజేపీ ఎంపీతో సహా పలువురికి ఆహ్వానం..
- సొంతపార్టీ సీనియర్ నేత వీహెచ్ కనిపించడం లేదా..? బీసీ సంక్షేమ శాఖ మంత్రి తీరుపై కాంగ్రెస్ బీసీ నాయకుల ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు గుర్రుగా ఉన్నారు. కులగణనకు సంబం ధించి ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు పార్టీకి చెందిన సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, డెడికేటేడ్ కమిషన్ వేయడంతో పాటు అసెంబ్లీలో నివేదికను వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.
అయితే బీసీ జనాభా తగ్గిందని, ఇది ప్రభుత్వం చేసిన కుట్రేనని బీసీసంఘాలు, మేధావుల నుంచి విమర్శలు రావడంతో.. శనివారం సచివాలయంలో బీసీ కుల సంఘా లు, మేధావులు, బీజేపీతో పాటు సొంత పార్టీ నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పార్టీలో మొదటి నుంచి బీసీ నినాదం వినిపిస్తున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావును ఆహ్వానించకపోవడంతో.. పార్టీలోని పలువురు సీనియర్లు, ఇతర బీసీ నాయ కులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్‌లో వీహెచ్ అంటేనే బీసీ నినాదానికి బ్రాండ్ అంబాసిడర్ అని, అలాంటి సీనియర్‌ను ఆహ్వానించకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమావేశానికి కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, అం జన్‌కుమార్‌యాదవ్, ఎంపీ సురేశ్‌షెట్కార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులను ఆహ్వానించిన మంత్రి పొన్నం..
పార్టీకి చెందిన పలువురు సీనియర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. 2004 ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ అగ్రనాయ కురాలు సోనియాగాంధీతో వరంగల్‌లో లక్షలాది మందితో వీహెచ్ నిర్వహించిన బీసీ గర్జన కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దో హదపడిందని మరో బీసీ నాయకుడు గుర్తు చేశారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే వీహెచ్‌ను మంత్రి పొన్నం విస్మరించడం సరికాదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది.