calender_icon.png 19 February, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతుల్లో సీనియారిటీని పరిగణించాలి

16-02-2025 12:47:10 AM

* మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రభుత్వ వైద్యుల సంఘం విజ్ఞప్తి

* ఎస్సీ వర్గీకరణపై అపోహలు తొలగించాలని మేధావులకు పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి): సీనియారిటీ ప్రకారమే పదోన్న తులు కల్పించాలని ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరుకు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు శనివారం మంత్రి దామోదర  రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల్లో సీనియర్ వైద్యులకు జరుగుతున్న అన్యాయాన్ని సరి చేయాలని మంత్రిని కోరారు.

స్పెషాలిటీ వైద్యులు జనరల్ లైన్‌లో ఉన్న పోస్టులను అక్రమ పద్దతిలో పొందుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యుల సమస్యను విన్న మం త్రి.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ జ్యుడీషియరీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు నగరం అంజయ్య, ప్రవీణ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ జాతి అభివృద్ధికి దోహదం చేస్తుందని ఈ సందర్భంగా రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. వర్గీకరణ ద్వారా మాదిగ సామాజిక వర్గానికి 9.77 % రిజర్వేషన్లు లభిస్తాయన్నారు.

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన గంట వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, సామాజికవేత్త విశారదన్, న్యాయవాదులు ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.