calender_icon.png 26 April, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీగా మీర్జా రియాజ్ ఉల్‌హసన్

26-04-2025 12:45:32 AM

  1. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం ఘనవిజయం
  2. బీజేపీ అభ్యర్థి కంటే 38 ఓట్లు అధికం
  3. 22 ఏండ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు

హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్‌హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రతీసారి దాదాపు ఏకగ్రీవమయ్యే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు 22 ఏండ్ల తర్వాత ఈ నెల 23న పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్‌హాల్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 45 నిమిషాల పాటు సాగింది.

ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్‌హసన్ విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగితే తమకు లబ్ధి చేకూరుతుందనుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు. మొత్తం 112 ఓట్లుండగా, అందులో 88 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌కు 63 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లే పడ్డాయి.

కాగా ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ చేయలేదు. ఎంఐఎంకు 49 మంది ఓటర్ల బలముండగా, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ పోటీ చేసిఉంటే తాను గెలిచేవాడినని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొనని బీఆర్‌ఎస్ వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

కార్పొరేటర్ స్థాయి నుంచి..

ఎమ్మెల్సీగా గెలిచిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ 2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నూర్జహాన్ బజార్ కార్పొరేటర్‌గా, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2019 మధ్య ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ నెల 23న జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్సీగా గెలుపొందారు.

నైతికంగా మాదే విజయం: గౌతమ్‌రావు, బీజేపీ అభ్యర్థి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతు తెలిపిందని.. మజ్లిస్ గెలుపునకు బీఆర్‌ఎస్ సైతం పరోక్షంగా సహకరించిందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్, -బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎం కనుసన్నల్లో పనిచేస్తున్నాయనడానికి ఈ ఎన్నికలే ప్రత్యక్ష సాక్షమన్నారు. నైతికంగా బీజేపీదే విజయమని ఆయన స్పష్టం చేశారు.