26-04-2025 12:41:52 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: రాష్ట్రాల్లో పర్యటిస్తున్న పాకిస్థానీ యుల గుర్తించి తక్షణం వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న పాకిస్థాన్ పౌరులను గుర్తించడంతోపాటు వారిని వెంటనే వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపించాలని కోరారు.
ఇలా పాకిస్థాన్ పౌరుల సమాచారాన్ని పంపడం ద్వారా వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. మరో వైపు పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన దీర్ఘకాలిక వీసాలు, దౌత్య, అధికారిక వీసాలు మినహా ఇతర అన్నిరకాల వీసాలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ ఆదేశాలు ఏప్రిల్ 27 నుంచి అమలులోకి వస్తాయని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సెలవులు రద్దు..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దయ్యాయి. జమ్ముకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లోని ఉన్నతాధికారులు తాజాగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేయడంతోపాటు ఇప్పటికే సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. జమ్ముకశ్మీర్ అంతటా భద్రతా బలగాలు మోహరించి.. ఉగ్రవాదుల ఆచూకీ కోసం జల్లెడపడుతున్నాయి.
నీటి బొట్టు కూడా పాక్‌కు వెళ్లదు!
సింధూ నదీజలాల్లో నీటి బొట్టును కూడా పాకిస్థాన్‌కు పోనివ్వమని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఇందుకోసం భారత ప్రభుత్వం మూడు ప్రణాళికలను సిద్ధం చేసిన్నట్టు వెల్లడించారు. పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాల, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు ఉన్నట్టు పాటిల్ వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 1960లో పాక్‌తో కుదుర్చుకున్న సింధూ నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో భవిష్యత్తు కార్యరణపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా అనేక సూచనలపై కేంద్ర మంత్రులు చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నదీజలాలను నిలిపివేయడం ద్వారా వచ్చే చట్టపరమైన సవాళ్లతోపాటు ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ ఒక వేళ ప్రపంచ బ్యాంకు తలుపుతట్టినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించాయి.