calender_icon.png 25 October, 2024 | 3:56 AM

సేనాపతి మరో పోరాటం.. కాళ్ల కింది కలుపు మొక్కలపైనే!

13-07-2024 04:42:10 AM

సినిమా రివ్యూ

భారతీయుడు - 2

నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు

ఛాయాగ్రహణం: రవి వర్మన్

సంగీతం: అనిరుధ్

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్

దర్శకత్వం: ఎస్.శంకర్

విడుదల: 12 జూలై 2024

ప్రేక్షకాదరణ పొందిన కమల్‌హాసన్ చిత్రాల్లో ‘భారతీయుడు’ చెప్పుకోదగ్గది. ఎస్.శంకర్ దర్శకత్వంలో 1996లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ సినీ ప్రియుల గుండెల్లో పదిలంగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు-2 శుక్రవారం విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉంది? ఓ సారి సమీక్షించుకుందాం... 

కథ ఏమిటి?

చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), హారతి (ప్రియా భవానీ శంకర్)కు ఇంకో ఇద్దరు స్నేహితులుంటారు. ఈ నలుగురూ కలిసి అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తుంటారు. సభ్య సమాజంలో జరిగే కుతంత్రాలపై రగిలిపోతూ ఉంటుందీ మిత్రబృందం. ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచం అడిగారన్న కారణంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోవటంతో చలించిపోయిన అరవిందన్.. భారతీయుడు అలియాస్ సేనాపతి (కమల్‌హాసన్) మళ్లీ రావాల్సిన అవసరం ఉందని భావిస్తాడు.

‘కమ్ బ్యాక్ ఇండియన్’ హ్యాష్‌ట్యాగ్‌తో అరవిందన్ బృందం పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ఎలా విప్లవాన్ని సృష్టించాయి? ఆ పిలుపు అందుకొని ఇండియాకు వచ్చిన సేనాపతి లక్ష్య సాధన కోసం ఏం చేశాడు? అసలు ఇన్నాళ్లూ ఆయన ఎక్కడున్నాడు? మాతృభూమిపై అడుగుపెట్టిన సేనాపతిని పట్టుకోవాలన్న సీబీఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహా) ప్రయత్నాలు ఫలించాయా?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది? 

ప్రస్తుత సమాజంలో అవినీతి ఎలా ఉంది? ఓటు వేస్తున్న ప్రజల్లో స్వార్థం ఎలా ఉంది? వంటి అంశాలతో సినిమా ఆరంభమవుతుంది. కార్టూన్స్ తరహా సన్నివేశా లు ఆకట్టుకుంటాయి. భారతీయుడు రాక కోసం పిలుపు, ఆయన వచ్చి యువతలో పోరాట స్ఫూర్తి రగిలించేందుకు నడుం కట్టిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఓ వైపు అవినీతి పరులను అంతమొందిస్తూనే.. మరోవైపు రెండో స్వతంత్ర పోరాటం అంటూ టు ట్రాక్ మిషన్‌ను కొనసాగించడం మెప్పించింది. మొదటి భాగంలో మర్మకళ గురించి చెప్పగా, రెండోభాగంలో వర్మకళను ప్రస్తావించారు.

సీక్వెల్‌లో సేనాపతి ‘మన కాళ్ల కిందే కలుపు మొక్కలు ఉన్నాయి’ అంటూ యువతరాన్ని ముందుకు నడిపించడం చూస్తాం. ఆఖరున మూడో భాగం ఉంటుందంటూ చూపించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రీక్వెల్‌లోనే అవినీతి అంశాన్నంతా చెప్పిన దర్శకుడు, తొలిభాగాన్ని పోలిన కథేనే మళ్లీ చూపించారన్న అసంతృప్తి మిగిలింది. డ్రామాను రక్తి కట్టించడంలో,  భావోద్వేగాలను పండించడంలో ఇంకా కష్టపడాల్సి ఉందనిపిస్తుంది. 

నటీనటుల ప్రతిభ ఎలా ఉందంటే..? 

పూర్తి వృద్ధాప్య ఛాయల వైవిధ్యమైన గెటప్‌లలో కమల్‌హాసన్ జీవించారు. సిద్ధార్థ్, ప్రియ భవానీ శంకర్ పాత్రలు కీలక పాత్రల్లో మెప్పించారు. రకుల్ పాత్ర ప్రాధాన్యం లేనిదే. బాబీ సింహా పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండేది. కెమెరా మెన్‌గా రవివర్మ పనితీరు బాగుంది. స్వరాల్లో అనిరుధ్, ఎడిటింగ్‌లో శ్రీకర్ ప్రసాద్ మార్కు కనిపించలేదు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా కథను శంకర్ బలంగా చెప్పలేకపోయారు.