పటాన్ చెరు, జనవరి 31 : కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురు-శుక్రవారాలలో ‘క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్ మెంట్, ఫార్మకోవిజిలెన్స్, అండ్ మెడికల్ రైటింగ్’పై నిర్వహించిన రెండు రోజుల సెమినార్ విజయవంతంగా ముగిసింది.
ఈ రంగంలో పేరొందిన క్లినోసోల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఎస్ ముజీబుద్దీన్ ప్రధాన వక్తగా వ్యవహరించారు. ఫార్మాస్యూటికల్, లైఫ్ సెన్సైస్ రంగాలపై పలు విషయాలను తెలిపారు.
తమ కెరీర్ లను మెరుగుపరచుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు, నిపుణుల కోసం రూపొం దించిన ఈ సెమినార్ క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్, మెడికల్ రైటింగ్, డేటా మేనేజ్ మెంట్ వంటి కీలకమైన రంగాలలో సమగ్ర జ్జానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే లక్ష్యంతో సాగింది. అధ్యయన రూపకల్పన, ప్రోటోకాల్ అభివృద్ధి, నియంత్రణ చట్రాలు, ఫార్మకోవిజిలెన్స్ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలను ఇందులో విశదీకరించారు.