ఈడీ దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 19: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు, వాటి ఫ్రిఫర్డ్ సెల్లర్ల మధ్య ఉన్న డైరెక్ట్ లింక్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెలికి తీసిందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌పై ఉత్పత్తులు విక్రయించే ఫ్రిఫర్డ్ సెల్లర్లు ఒక విధంగా ఈ-కామర్స్ సంస్థల బినామీలేనని ఈడీ దర్యాప్తులో వెల్లడయ్యింది.
ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనల కింద త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై తుది కేసును ఈడీ దాఖలు చేస్తుందని ఎకనామిక్ టైమ్స్ రాసింది. తుది దర్యాప్తు ఫైల్ చేసేముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అధికారుల్ని ప్రశ్నించనుంది.
ఇప్పటివరకూ సేకరించిన సాక్ష్యాధారాలు, ఫ్రిఫెర్డ్ సెల్లర్లను విచారించడం ద్వారా రాబట్టిన విషయాలను పూర్తిగా విశ్లేషించిన మీదట ఈ కామర్స్ సంస్థల అధికారులను ప్రశ్నించేందుకు సమన్లు పంపుతామని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
మాజీ ఉద్యోగులు, సంబంధీకులే సెల్లర్లు
అమెజాన్, ఫ్లిప్ట్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌పై విక్రయించే టాప్ ఫైవ్ సెల్లర్లను ఈడీ ఇంటరాగేట్ చేసి వాస్తవాల్ని బయటకు తీసింది. ఈ సెల్లర్లు చాలావరకూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగులు/అసోసియేట్లు లేదా ఆ కంపెనీల సంబంధీకులేనని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కామర్స్ దిగ్గజాలు, ప్రిఫర్డ్ సెల్లర్ల మధ్య ఈ మెయిల్స్‌ను ఈడీ సమీకరించి తగిన సాక్ష్యాధా రాలను సేకరించింది.
టర్నోవర్ రూ.25,000 వేల కోట్లు లాభం రూ.20 లక్షలే
ఫ్రిపర్డ్ సెల్లర్ల వద్దనుండే నిల్వలు, ఆ సెల్లర్ల లాభాల మార్జిన్లతో సహా సెల్లర్ల వ్యాపారమంతా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చేతుల్లోనే ఉంటుందని ఈ మెయిల్స్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సెల్లర్‌ను ఈడీ విచారించగా ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ సెల్లర్ వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లుపైనే. కానీ వార్షిక లాభం దాదాపు రూ.20 లక్షలే.
ఆ సెల్లర్ నివాసం ఉండేది రెండు ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో. టర్నోవర్, లాభం మధ్య ఉన్న భారీ వ్యత్యాసం చూస్తుంటే లాభాల మార్జిన్లను సైతం ఆ సంస్థలే కంట్రోల్ చేస్తున్నాయని అర్థమవుతున్నదని ప్రభుత్వ అధికారి వివరించారు. ఫ్రిపర్డ్ సెల్లర్ల బ్యాంక్ ఖాతాలను కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లీగల్ టీమ్ తయారుచేసి, పర్యవేక్షిస్తుందని ఈడీ దర్యాప్తులో తేలింది.
వాస్తవానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టం ప్రకారం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను చిన్న రిటైల్ ట్రేడర్లతో పాటు సెల్లర్లందరికీ ఓపెన్‌గా ఉంచాలి. ఇన్వెంటరీ, వేర్‌హవుస్‌లు, లాభాల మార్జిన్లు తదితర కీలకమైనవాటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు అధీనంలోకి తీసుకోవడం ఎఫ్‌డీఐ చట్టాల ఉల్లంఘనేనని, స్వప్రయోజనాలకు మల్టీబ్రాండ్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకుంటున్నాయని ఆ అధికారి వివరించారు.