పిల్లలకు పాలే బలం. కానీ కల్తీపాల కారణంగా ఎంతోమంది చిన్నారులు రోగాల బారినపడుతున్నారు. అజీర్తితోపాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన జ్యోతిపద్మ అనే తల్లిని కదిలించాయి. తనలాంటి బిడ్డల కోసం స్వచ్ఛమైన పాలు అవసరమని గ్రహించింది. దాచుకున్న డబ్బులతో 15 ఆవులతో వ్యాపారం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎంతోమంది తల్లులకు స్వచ్ఛమైన పాలను అందిస్తూ కోట్లలో లాభాలు రాబడుతోంది.
జ్యోతి ఓసారి తన కూతురుకు ప్యాకెట్ పాలు తాపించింది. పాలు తాగిన వెంటనే కక్కేసింది. అలా ఎన్నోసార్లు జరిగింది. బలాన్నిచ్చే పాలు తన కూతురు ఎందుకు జీర్ణించుకోలేకపోతుందో అర్థంకాలేదు. అయితే మిగతా పిల్లల్లా తన బిడ్డ పాలని సహించుకోలేకపోతుందనే విష యం బోధపడింది.
చివరికి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే, తన కూతురుకి ‘లాక్టోజ్ ఇన్ టోలరెన్స్’ అనే లోపం ఉందని తెలుసుకుంది. తన కూతురు పాలుగానీ, పాల ఉత్పత్తులు కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుందన్న నిజం తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి గురైంది. స్వచ్ఛమైన పాలతోనే తన కూతురు ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేసింది.
మిల్క్ డైరీ ఫామ్
ఆవుల పెంపకం, పాలలో ప్రోటీన్ కంటెంట్‌ను మెరుగుపరిచే ఆహారం, పాడి వ్యవసాయం.. ఇలా అనేక ఇతర విషయాల గురించి తెలుసుకుంది. దేశీ ఆవుల పాలు పిల్లల బాగా సరిపోతాయని గ్రహించింది. ఇందుకోసం పది నెలలపాటు అధ్యయనం చేసింది. ముంబై హైవేకి దగ్గరలో రెండు ఎకరాల స్థలాన్ని తీసుకుని అందులో కొత్త ఫామ్ ఏర్పాటుచేసింది. అలా 2019లో ‘మిల్క్ డైరీ ఫామ్’ మొదలైంది.
అక్కడ జ్యోతి, ఆమె భర్త ఆవులని స్వేచ్ఛగా తిరగనిచ్చి, నేపియార్ గడ్డి, గోధుమ గడ్డి, మిల్లెట్స్ వంటి ఆర్గానిక్ మేతతో పోషిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన (ఏ2) పాలను అందించటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. యంత్ర వినియోగం కూడా లేకుండా సాంప్రదాయ పద్ధతుల్లో పాలని తీసి స్వచ్ఛంగా మార్కెట్‌లో అమ్ముతోంది. పాల నాణ్యత బాగుం డటంతో అందరూ వీరి దగ్గర పాలు తీసుకోవటం మొదలుపెట్టారు. దాదాపు 200 మంది కస్టమర్స్‌ను సంపాదించుకుని, సం వత్సరానికి కోటి రూపాయల ఆదాయం పొందగలిగే డైరీగా ఎదిగింది.
కూరగాయలు కూడా
ప్రస్తుతం రోజుకి 250 లీటర్ల పాలు అమ్ముతోంది. దాంతో పాటే నెయ్యీ అమ్ముతోంది. ఒక్క నేతి అమ్మకాలతోనే ఏడాదికి రూ.12 నుంచి 15లక్షల ఆదాయం పొందుతోంది. పాలు, నెయ్యి ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా ఆర్జిస్తోంది. అదే సమయంలో పాలతోపాటు కూరగాయలను సరఫరా చేయాలని అక్కడి ప్రజలు కోరడంతో అదీ మొదలుపెట్టింది. ఆరుగురికి ఉపాధి కల్పించే ఆమె పొలంలో రోజూ ఉదయం ఐదు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు ఆవులకు పాలు పోస్తారు.
ఉదయం ఎనిమిది గంటలకే పాల సరఫరా ప్రక్రియ పూర్తవుతుంది. అంతేకాదు.. అవసాన దశకు చేరిన ఆవుల బాగోగులను కూడా చూసుకుంటోంది జ్యోతి. “మేం ఆవు పేడ, మూత్రాన్ని వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తాము. చివరి శ్వాస వరకు ఆవులు మాతోనే ఉంటాయి” అని చెబుతోంది.
కల్తీకి చెక్ పెట్టాలి
కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే స్త్రీలలో రుతు ప్రవాహం, కంటి నష్టం, కిడ్నీ వ్యాధులు, జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తాయి. కల్తీపాలను నివారించాలంటే తల్లిదండ్రులకు కొంతైనా అవగాహన ఉండాలి. పిల్లలకు తాపించే పాలు స్వచ్ఛమైనవా? కల్తీవా? తెలుసుకోవడం చాలా ముఖ్యం