- అపోహలు సృష్టించిన వారిపై క్రిమినల్ చర్యలు
- వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం స్పందించాలి
- ముగిసిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ
- త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతుంటే, కొందరు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజా సంక్షేమానికి కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం సర్వే చేపడుతుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేసే వారిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణలో పలు కుల సంఘాల నుంచి వినతులు స్వీకరించారు.
దరఖాస్తుల్లో మొత్తంగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. వివిధ కుల సంఘాలు తమ వెనుకబాటు తనాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా నాయీబ్రాహ్మణు లను దేవాలయ కమిటీల్లో సభ్యులుగా గుర్తించాలని, గంగపుత్రులకు చేపల చెరువుల్లో 50 శాతం రిజర్వ్ చేయాలని, ఆత్మ గౌరవ భవనాలను నిర్మించాలని కోరారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలు, రాష్ట్రస్థాయి బహిరంగ విచారణలో భాగంగా మొత్తం 1,336 వినతులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఎంతటి వారైనా సమగ్ర సర్వేపై అవాస్తవాలు, అపోహలు సృష్టిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్‌తో పేద బాలిక మరణించిందని, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. సరైన వసతులు లేకుండా విద్యార్థులు చదువుల్లో ఎలా రాణిస్తారని, ఈ దుస్థితికి ప్రజాప్రతినిధులు, అధికారులు కారణం కాదా? అని ప్రశ్నించారు. సర్వే, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తున తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
సర్వే చేసిన డాటా భద్రపరిచే ప్రదేశంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. సర్వేపై నివేదికను కోర్టులో సమర్పించే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, స్పెషల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.