- 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి
- కాపాడిన హోంగార్డులు
పుణె, ఆగస్టు 4: యువతి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తెచ్చింది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన కొందరు శనివారం సతారా జిల్లాలోని థోస్ఘర్ జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేక వాహనంలో బయల్దేరారు. మార్గమధ్యంలోని బోరనేఘాట్ వద్ద వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపి నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి 60 అడుగుల లోయలోకి పడిపోయింది.
గమనించిన స్థానికులు, హోంగార్డులు జోరువాన, చిత్తడి వంటి అడ్డంకులు ఎదుర్కొని తాడు సాయంతో ఆమెను ఘాట్పైకి తీసుకొచ్చారు. ఆమె తీవ్రగాయాల పాలు కాగా హోంగార్డులు వెంటనే సతారాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ జితేంద్ర దూడి వానలు నిలిచిపోయే వరకు జలపాతాలు ఉండే పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన హోంగార్డులను ప్రత్యేకంగా అభినందించారు.